Kadapa Lok Sabha Elections 2024 : సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్‌లో ఎన్డీఏ కూటమి కాలుదువ్వుతోంది. మూడు నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల వైఎస్సార్సీపీతో హోరాహోరీగా తలపడుతోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు పలు నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ఇది వైఎస్సార్సీపీకి ఊహించని పరిస్థితే. అందుకే చివరి అస్త్రంగా ఆ పార్టీ డబ్బు వెదజల్లుతోంది. గత ఐదేళ్లూ పులివెందుల మినహా మిగతా నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పుడు ఇదే కీలకంగా మారాయి. అటు కడప పార్లమెంట్ పోటీ రసవత్తరంగా మారిందని 'ఈనాడు' ప్రత్యేక ప్రతినిధి పరిశీలనలో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మాధవీరెడ్డి V/S అంజాద్‌బాషా : వైఎస్సార్ జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కడప గడపలో ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలుగుదేశం అభ్యర్థి మాధవీరెడ్డికి ఒక్క అవకాశమివ్వాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా అంజాద్‌బాషా వరుసగా రెండుసార్లు గెలిచి మూడోసారి బరిలో ఉన్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అభివృద్ధిని, సమస్యల్ని పట్టించుకోలేదని ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలూ పుంఖానుపుంఖాలు. పెద్దదర్గా పరిధిలోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ముస్లింలు వాపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్‌ఖాన్ ముస్లిం ఓట్లను భారీగా చీల్చనున్నారు.
పుట్టా సుధాకర్‌యాదవ్ V/S శెట్టిపల్లి రఘురామిరెడ్డి : గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్‌యాదవ్‌పై సానుభూతిపవనాలు వీస్తున్నాయి. ఆయనకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈసారి గెలుపు 'పుట్టా'దే అని స్పష్టంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇసుకను, మట్టినీ వదల్లేదని ప్రజలు చెబుతున్నారు. గత ఎన్నికలు జగన్ కేంద్రంగానే నడిచాయని, తామంతా అప్పట్లో వైసీపీకే ఓటేశామని, ఈసారి ఆ పరిస్థితి లేదని మైదుకూరు నగర పరిధిలోని 8 మంది మధ్యవయస్కులు చెప్పారు. నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంకు కలిగిన డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీకు మద్దతుగా నిలవడం ఆ పార్టీకి మరింత కలిసొచ్చే అంశం.
ఆరంభంలోనే కడపలో జెండా ఎగరేసిన టీడీపీ - షర్మిల రాకతో రసవత్తర పోరు - kadapa LOK SABHA ELECTIONS
వరదరాజులరెడ్డి V/S రాచమల్లు శివప్రసాద రెడ్డి : ప్రొద్దుటూరులో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకనే ప్రచారం సాగుతోంది. ఈసారి గెలిచేది పెద్దాయన వరదరాజులరెడ్డి అని ఎక్కువమంది నోట వినిపిస్తోంది. చివరి అస్త్రంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి డబ్బును ప్రయోగిస్తున్నారు. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య బీసీల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఇక్కడ బీసీల ఓట్లు 60వేల వరకు ఉన్నాయి. రాచమల్లు అవినీతిపైనా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. గత ఐదేళ్లలో అడ్డగోలుగా సాగిన క్రికెట్ బెట్టింగ్, ఇసుక మాఫియా ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నాయి. బంగారు అంగళ్ల వ్యవహారం, తాత్కాలిక మార్కెట్‌లో గదుల కేటాయింపులో వసూళ్లు, బినామీ పేరుతో చర్చి భూముల కొనుగోలు కీలకం కానున్నాయి.
బొజ్జా రోషన్న V/S డాక్టర్ దాసరి సుధ : బద్వేలు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయినా, బలమైన సామాజికవర్గాలే అనుచరుల్ని దింపి రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈసారి ఇక్కడ టికెట్ బీజేపీకు దక్కడంతో బొజ్జా రోషన్న పోటీ చేస్తున్నారు. ఎన్డీయే బలమైన పోటీ ఇస్తున్నా గెలుపు అవకాశాలు వైసీపీకే ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని, గ్రామాల్లో ఎక్కడా పట్టు సడలనివ్వడం లేదని పెద్దుళ్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చెప్పారు. వ్యాపారవర్గాలు కూటమి వైపు మొగ్గుచూపుతున్నారని, ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీనే అని వీరారెడ్డి సర్కిల్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. వైఎస్సార్సీపీ తరుఫుల ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు.
ఆదినారాయణరెడ్డి V/S సుధీర్‌రెడ్డి : కడప లోక్‌సభ పరిధిలో ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో జమ్మలమడుగు ఒకటి. పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆయన అన్న కుమారుడు భూషేశ్‌రెడ్డి ఉన్నారు. రామసుబ్బారెడ్డి టీడీపీను వీడి వైసీపీలో చేరినా, కీలక నేతలెవరూ ఆయన వెంట వెళ్లలేదు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న పని చేయాలన్నా డబ్బు ముట్టజెప్పాల్సిందే అనే చర్చ జరుగుతోంది. ఇసుక మాఫియా, భూకబ్జాలు, జమ్మలమడుగులో కిలో చికెన్‌పై 10 చొప్పున వసూలు ఎన్నికల్లో కీలకంగా నిలుస్తున్నాయి. వైసీపీ క్యాడర్‌లోనూ ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది. చివరి అస్త్రంగా సొంతపార్టీ నాయకుల్నే డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
నవనందుల నంద్యాల లోక్‌సభ - వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు - Nandyala Lok Sabha Constituency
పుత్తా చైతన్యరెడ్డి V/S రవీంద్రనాథ్‌రెడ్డి : కమలాపురంలో జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున మూడోసారి బరిలో దిగారు. గత రెండుసార్లు గెలిచినా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదు. ఆయనకు టీడీపీ నుంచి పుత్తా చైతన్యరెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక్కడ ఎవరి నోట విన్నా 'హోరాహోరీ'నే అనే మాట వినిపిస్తోంది. రవీంద్రనాథ్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు ప్రభావం చూపనున్నాయి. పెండ్లిమర్రి మండలంలో భూముల ఆక్రమణ, వీరపునాయునిపల్లె మండలం చేపల చెరువులపై చర్చ జరుగుతోంది.
జగన్ V/S బీటెక్ రవి : పులివెందులలో జగన్ గెలుపు నామమాత్రమే. కానీ గతం కంటే ఈసారి టీడీపీ పుంజుకుంది. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ వివేకా హత్య కూడా ఈ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఇది ప్రభావం చూపిస్తే జగన్ మెజారిటీ తగ్గే అవకాశముంది. సీఎంగా ఉన్న జగన్‌ను నియోజకవర్గ ప్రజలు కలవాలంటే ఎంపీ అవినాష్‌రెడ్డి అనుమతి ఉండాల్సిందే. నేరుగా కలిసే అవకాశం లేదు. ప్రజల్లో అసంతృప్తికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది.
గతం కంటే వైసీపీకి ఇక్కడ మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఓట్ల రూపంలో ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని పూలవ్యాపారి ఒకరు వెల్లడించారు. జగన్ చెల్లెళ్లు షర్మిల, సునీత ప్రచారమూ ఆ పార్టీ మెజారిటీకి గండి కొడుతుందని లింగాలకు చెందిన వైసీపీ నేత ఒకరు చెప్పారు. వైసీపీ అవినీతి పాలన, ఇసుక దందాతో ప్రజలు విసిగి పోయారని, హత్యలు కూడా జరిగాయని, ఇవన్నీ తమకు లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ చేస్తున్నారు.
వైఎస్ అవినాష్ రెడ్డి V/S వైఎస్ షర్మిల V/S భూపేష్ రెడ్డి : అటు కడప పార్లమెంటు స్థానంపై రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తుండగా ఆయన్ని ఓడించాలని, చిన్నాన్న చివరి కోరిక తీర్చాలనే పట్టుదలతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. వివేకా కుమార్తె సునీత కూడా షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నుంచి యువకుడు భూపేష్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
వైఎస్ కుటుంబందే హవా? : కడప పార్లమెంటు పరిధిలో మొత్తం 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు . కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. కడప లోక్ సభకు 16 సార్లు ఎన్నికలు జరిగితే వై.ఎస్.కుటుంబ సభ్యులే 10 ఎన్నికల్లో వరుసగా ఎంపీలుగా గెలుపొందారు. వీరిలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 4 సార్లు, వివేకానందరెడ్డి 2 సార్లు, వై.ఎస్.జగన్ ఉప ఎన్నికతో కలిసి 2 సార్లు, వై.ఎస్.అవినాశ్ రెడ్డి 2 సార్లు కడప పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
1984లో మాత్రమే డీఎన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1989 నుంచి 2019 వరకు వై.ఎస్.కుటుంబ సభ్యులే ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు. 1996లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కేవలం 5 వేల ఓట్లతోనే అతికష్టం మీద ఎంపీగా గట్టెక్కారు. ఈసారి కడప పార్లమెంటు స్థానానికి అవినాశ్ రెడ్డి మూడోసారి బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యతో సానుభూతి పొందిన అవినాష్ రెడ్డి విజయం సాధించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, జిల్లాకు ఆయన చేసిన అభివృద్ధి ఈసారీ తనను గెలిపిస్తాయని అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వివేకా హత్య అంశమే ఈ సారి అవినాష్ రెడ్డి కొంప ముంచే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అవినాష్ రెడ్డిని ఏ-8 నిందితుడిగా ఛార్జిషీట్ లో చేర్చింది. తండ్రి హత్యపై వివేకా కుమార్తె సునీత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేయడమే కాక అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో బహిరంగ ఆరోపణలు చేయడం ఆయనకు సంకటంగా మారింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చినా మళ్లీ ఆయనకే మూడోసారి జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని వై.ఎస్.షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉంటూనే కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. అవినాష్ రెడ్డిని చట్టసభల్లోకి వెళ్లకుండా ఓడించాలనే లక్ష్యంతో వివేకా కుమార్తె సునీత, షర్మిల పని చేస్తున్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లోకి భూపేష్ రెడ్డి : ఇక టీడీపీ తరపున కడప పార్లమెంటు స్థానానికి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న భూపేష్ రెడ్డి అసెంబ్లీ స్థానాన్ని ఆశించినా కూటమి పొత్తులో భాగంగా దాన్ని బీజేపీకు కేటాయించారు. ఆ స్థానంలో భూపేష్ రెడ్డి బాబాయ్ మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి బరిలో ఉండటం కలిసొచ్చే అంశం. భూపేష్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ప్రత్యర్థులు ఇద్దరూ వైఎస్ కుటుంబ సభ్యులే కావడం వారు వివేకా హత్య కేసులో ఉండడం తమకు లాభిస్తుందని భూపేష్ ఆశాభావంతో ఉన్నారు.
కడప ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుచూపుమేరలో కూడా లేకపోయినా షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయని అంటున్నారు.
కర్నూలు లోక్‌సభ బరిలో బీసీ అభ్యర్థులు - రసవత్తరంగా పోరు - kurnool loksabha