Damacharla Vs Balineni in Prakasam District : ప్రకాశం జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా హోరాహోరీగా తలపడిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య మరోసారి వార్ మొదలైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీని వీడి అధికార కూటమిలోని జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ పరిణామాన్ని టీడీపీతోపాటు జనసేన నాయకులూ జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రకాశం జిల్లాలో ఎక్కడా లేని విధంగా గత ఎన్నికల్లో నగరంలోనే ఉద్రిక్త పరిస్థితులు, దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. పలువురు జైలు పాలయ్యారు. అధికార కూటమిలోని జనసేనలో మాజీ మంత్రి బాలినేని చేరికను జనసేన నాయకులతో పాటూ టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తూర్పునాయుడుపాలెంలో జరిగిన కార్యక్రమంలో బాలినేనిని ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల ఘాటు వ్యాఖ్యలు చేయగా, ఒంగోలులో బాలినేని ప్రతి సమాధానమిచ్చారు.
మీ అనినీతి మొత్తం వెలికి తీస్తాం : ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
‘మీరు, మీ కుమారుడు చేసిన అవినీతి పనులు మొత్తం వెలికి తీస్తాం. ఏ పార్టీలో చేరినా వాటి నుంచి తప్పించుకోలేరు. కేసులు పెడతారని తెలిసే పార్టీ మారుతున్నార’ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యాఖ్యానించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఆదివారం నిర్వహించిన మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వం మారి వంద రోజులైంది. గతంలో చేసిన పాపాలు, అవినీతి నుంచి తప్పించుకునేందుకు ఓ పెద్దమనిషి పార్టీ మారుతున్నారు. అప్పుడే మా వారికి ఏదైనా ఇబ్బంది జరిగితే అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నారు.
జిల్లాలో టీడీపీ లేకుండా చేస్తానన్న ఆయన ఇప్పుడు మరో గత్యంతరం లేకే పార్టీ మారుతున్నారు. అయినా వదిలి పెట్టం. ఆయన అక్రమాలన్నీ బయటపెడతాం. అప్పుడు ఎవరూ ఆయనను కాపాడలేరు. వైఎస్సార్సీపీ పాలనలో అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. మహిళల్ని సైతం వదిలిపెట్టలేదు. నాపైనే 23 కేసులు పెట్టారు. మా నాయకుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను దూషించారు. పార్టీ ఆవిర్భావం నుంచి మేం టీడీపీలోనే ఉన్నాం. ఏదైనా ఇబ్బంది వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామే తప్ప ఇతర పార్టీల వైపు కన్నెత్తి చూడం. గత ఎన్నికల్లో మా విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విశేషంగా కృషి చేశారు. అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. వారందరికీ తోడుగా ఉంటామ’ని పేర్కొన్నారు.
ఇబ్బందుల వల్లే పార్టీ మారుతున్నా, జనసేన అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తా : మాజీ మంత్రి బాలినేని
‘జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు నామీద సదాభిప్రాయం ఉంది. నాలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలని రెండు మూడు సమావేశాల్లోనూ ప్రస్తావించారు. నాకు కలిగిన ఇబ్బందుల వల్లే పార్టీ మారుతున్నాను. ఎమ్మెల్యే జనార్దన్ ఆరోపణల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడారు. జనసేన అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ‘నా మీదా, నా కుమారుడి మీదా వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి పదిహేను రోజుల క్రితమే లేఖ రాశా. అయినప్పటికీ అదేపనిగా విమర్శిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది. విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు.
జనసేనలోకి వస్తున్నానని కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. నేనెక్కడా రాజీపడను. ప్రశ్నించే పార్టీ జనసేన. ఎక్కడ తప్పులు జరిగినా ప్రశ్నిస్తా. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనను ప్రజలు ఎన్నుకున్నారు. అధికారం ఉంది. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటారు. మేమేమీ చేయం. జనసేనలో చేరుతున్నందున ప్రాధాన్యమివ్వాలని కోరాం. అంతకు మించి నేనేమీ మాట్లాడలేదు. ఒంగోలులో ఫ్లెక్సీలు ఎవరు కట్టారో నాకు తెలియదు. ఆయన బొమ్మ వేశారట. ఇకపై ఆయన బొమ్మలు వేయొద్దని అందరికీ చెబుతాన’ని తెలిపారు. ఇకపై పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు పని చేస్తామని, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
జనసేనలోకి బాలినేని, కిలారి రోశయ్య, ఉదయభాను - ముహూర్తం ఎప్పుడంటే ? - YSRCP Leaders to Join Janasena