Political Heat in Chirala YSRCP: చీరాల నియోజవకర్గంలో అధికార వైసీపీలో కీలక మలుపు తిరిగింది. ‘రాబోయే ఎన్నికల్లో నేను చీరాల నుంచే పోటీ చేస్తా, ఏదైనా పార్టీ తరఫునా లేదా స్వతంత్రంగా అనేది అతి త్వరలోనే ప్రకటిస్తా’ అని చీరాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణ మోహన్ తన వర్గీయులకు స్పష్టం చేశారు.
ఆయన సోమవారం తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వెళ్లారు. మంగళవారం చీరాలలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ప్రస్తుతం చీరాల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్న కరణం వెంకటేష్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని అని, తనని గెలిపించాలంటూ సభలో పాల్గొన్న నేతలు ప్రకటించారు. దీంతో అదే రోజు రాత్రి ఆమంచి వేటపాలెం మండలం కఠారివారిపాలెం సమీపంలో తన అనుచరులతో రహస్య సమాచారం నిర్వహించినట్లు తెలిసింది.
ఆ సమావేశంలోనే ఆయన చీరాల నుంచే పోటీ చేయబోతున్న విషయాన్ని వారికి చెప్పారని సమాచారం. ‘మనం పోటీ చేయబోతున్నామన్న విషయాన్ని ముందుగా నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకువెళ్లండి’ అని ఆయన వారికి చెప్పినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకుని ఇటీవలే చీరాలకు వెంకటేష్ తిరిగొచ్చారు. చీరాలలో తానే బరిలో దిగుతున్నట్లు వెంకటేష్ ప్రకటించుకున్నారు. అందులో భాగంగానే వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం సామాజిక సాధికార బస్సు యాత్రను నియోకవర్గంలో చేపట్టారు.
మరోవైపు ఎమ్మెల్సీ పోతుల సునీత బీసీ కోటాలో చీరాల సీటు తనదేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆమంచి నిర్ణయంతో చీరాల అధికార పార్టీలో టికెట్ రాజకీయ రసవత్తరంగా మారింది. పర్చూరుకు వెళ్లడం ఇష్టం లేకపోయినా సీఎం చెప్పడంతో అయిష్టంగానే 2022 డిసెంబరులో ఆమంచి అక్కడకు సమన్వయకర్తగా వెళ్లారు. పర్చూరు సమన్వయకర్తగా నియమితుడైనప్పటికీ చీరాలలో తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తూనే వచ్చారు.
దీంతో చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్, ఆమంచి వర్గాలకు తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గత ఆగస్టులో వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ వార్డు సభ్యుల ఉప ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వివాదం తలెత్తింది. ఆ సమయంలో కరణం, ఆమంచి వర్గాలు పరస్పరం దాడులకు దిగారు. కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్ తమ వర్గీయులతో మోహరించి ఎదురెదురుగా సవాళ్లు విసురుకున్నారు. చీరాల- వేటపాలెం రోడ్డుపై అనుచరులు రాళ్ల దాడికి దిగారు.
ఆ సమయంలో ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక పోలీసు బలగాలతో స్వయంగా రంగంలోకి దిగి ఇరువర్గాలపై లాఠీఛార్జీ చేయించి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. అప్పటి నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కానీ, ఈ ఏడాది కాలంలో చీరాలలో తానే పోటీ చేస్తానని ఆమంచి ఎప్పుడూ ప్రకటించలేదు. సోమవారం సీఎంను కలిసినపుడు, చీరాలలో కరణంకే సీటు ఖరారు చేస్తున్నామని సీఎం చెప్పడంతోనే ఆమంచి ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ‘చీరాలలో బీసీలకు టికెట్ ఇస్తామన్నందుకే పర్చూరుకు వెళ్లానని, కానీ ఇప్పుడు కరణం కుటుంబానికి టికెట్ ఇస్తామంటే ఎలా? ఇలాగైతే కష్టం’ అని ఆమంచి సీఎం ముందే అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎంతో జరిగిన చర్చల వివరాలను తన అనుచరులతో జరిగిన భేటీలో ఆమంచి వెల్లడించినట్లు తెలిసింది.