NDA Alliance Won Irrigation Societies Elections in AP : రాష్ట్రంలో 6149 సాగునీటి సంఘాలకు నిర్వహించిన ఎన్నికల్లో 95 శాతానికి పైగా ఏకగ్రీవంగానే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. అన్ని సంఘాలూ ఎన్డీయే కూటమి ఖాతాలోకే వచ్చాయి. కొన్ని గ్రామాల్లో అధికార పార్టీలోనే కొందరి నాయకుల మధ్య ఉన్న సమస్యలు, మిత్ర పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలతో పాటు కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ నాయకులు రంగ ప్రవేశం చేసి వివాదాలు సృష్టించడంతో ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు పోటీ అనివార్యమయింది. కొన్ని సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అక్కడక్కడ పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
పులివెందులలో ఏకగ్రీవం : రాష్ట్రంలో మొత్తం 6149 సాగునీటి సంఘాలకు, 49020 ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఆయా ప్రాదేశిక నియోజకవర సభ్యులు సాగునీటి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ సాగునీటి సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులను ఎన్నుకుంటారు. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకు అత్యధికంగా ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికయ్యారు. సాధారణ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలూ పూర్తి చేశారు.
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మొత్తం సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. కూటమి పార్టీలకే అవి దక్కాయి. 1978 తర్వాత ఈ నియోజకవర్గంలో ఇలా కూటమి పార్టీ బలం చూపడం ఇదే ప్రథమం. వైఎస్సార్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన బయటకు వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఎన్నికలు వాయిదా : ఉమ్మడి నెల్లూరు జిల్లా కుడితిపాలెం సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు గొడవ పడ్డారు. వింజమూరు మండలం కిస్తీపురంలో వాదనకు దిగిన ఇరుపార్టీల శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. కొండాపురం మండలం ఇస్కదామెర్ల, సైదాపురం మండలం గిద్దలూరులో సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా వేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగాం నీటి సంఘం ఎన్నికల్లో గొడవ జరిగింది. పనుకువలస ప్రాదేశిక నియోజకవర్గంలో ఎన్నికల సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకుపోయారు. ఎన్టీఆర్ జిల్లా గణపవరంలో తోపులాటలతో నీటి సంఘం ఎన్నిక వాయిదా పడింది. కాకినాడ జిల్లా తాటిపర్తిలో ఎన్నిక నిలిపివేశారు. కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామ ఎన్నికల్లో జలవనరులశాఖ అధికారి జి. మధుశేఖర్‌పై కత్తితో కొందరు దాడి చేశారు.
ఘర్షణల మధ్య సాగునీటి సంఘాల ఎన్నికలు - వాగ్వాదంతో కొన్నిచోట్ల వాయిదా