Raghu Rama Krishna Raju Joined TDP: పాలకొల్లు ప్రజాగళం సభలో నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని రఘురామ కృష్ణరాజు అన్నారు. చంద్రబాబు, ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. జూన్ 4వ తేదీన చంద్రబాబు, పవన్ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతున్నారని రఘురామ తెలిపారు.
ప్రాణాలు ఒడ్డి పోరాడిన వ్యక్తి రఘురామ: ఎంపీ రఘురామ టీడీపీలోకి (TDP) చేరిన సందర్భంగా చంద్రబాబు (Chandrababu Naidu) మాట్లాడారు. ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వ్యక్తి రఘురామ కృష్ణరాజు అని అన్నారు. అయిదేళ్ల పాటు నిరంతరాయంగా పోరాడారని గుర్తు చేసుకున్నారు. మీ అందరి ఆమోదంతో పాలకొల్లులో రఘురామ కృష్ణరాజును మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీలో చేర్చుకుంటున్నామని, అందరూ దీనిని స్వాగతించాలని అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని అడుగుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రం దివాలా తీసినా బాగు పడింది ఒక్క జగన్ మాత్రమే: చంద్రబాబు - Prajagalam Public Meeting
ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టారు: ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు అని ప్రశ్నించారు. ఇది న్యాయమా, మీకు ఆమోద యోగ్యమా అని అడుగుతుతున్నానన్నారు. ఏంటీ అరాచకం, ఏంటీ సైకో పాలన అంటూ ధ్వజమెత్తారు. గతంలో రఘురామను పోలీసుల కస్టడీలోకి తీసుకొని ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టారని, ఆరోజు రాత్రి మొత్తం తాను మేల్కొని ఉన్నానని తెలిపారు. రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి అన్నివిధాలా ప్రయత్నిస్తే, చివరకు కోర్టు జోక్యంతో ఆయన బయటపడ్డారని గుర్తు చేశారు. లేదంటే ఈరోజు రఘురామకృష్ణరాజును మీరు ఎవరూ చూసేవాళ్లు కాదని చెప్పారు.
ప్రజలంతా రఘురామను ఆశీర్వదించాలి: అందుకే దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. అందుకోసం రఘురామ కృష్ణరాజు లాంటి వ్యక్తులతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరోసారి మీ అందరి ఆమోదంతో టీడీపీలోకి ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు అన్నారు. సభ ప్రారంభానికి ముందే రఘురామను పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలిపిన చంద్రబాబు, పాలకొల్లు ప్రజల సమక్షంలో రఘురామకు పసుపు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం చెప్పారు. రఘరామకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ, ఈ రోజు తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతించాలని చంద్రబాబు కోరారు. ప్రజలంతా రఘురామను ఆశీర్వదించాలని తెలిపారు.