Nara Lokesh on Fisherman Suicide: రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటు సైన్యంలా మారిపోయి బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వెల్దుర్తిలో టీడీపీ సానుభూతిపరులైన మత్స్యకారులను వైసీపీలో చేరాలని, లేదా 2 లక్షల రూపాయలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో బెస్త సోదరుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలకు తొత్తుగా మారి దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించడమే గాక పార్టీ మారాలని ఒత్తిడిచేయడం, ఆత్మహత్యకు పురిగొల్పడం యావత్ పోలీసు శాఖకే మాయని మచ్చ అని లోకేశ్ దుయ్యబట్టారు. ఖాకీ దుస్తులు వేసుకొని వైసీపీ నేతలకు ఊడిగం చేయడం దారుణమని విమర్శించారు. దేశంలో ఇలాంటి విపరీత పోకడలు మరెక్కడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సోదరుడి మరణానికి కారకుడైన ఎస్ఐ శ్రీహరి వంటి పోలీసులు మరికొద్దిరోజుల్లో రాబోయే టీడీపీ - జనసేన ప్రజాప్రభుత్వంలో కఠిన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన దుర్గారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!
Fisherman Suicide Due to SI Harassment: కాగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎస్సై వేధింపులు తాళలేక ఓ మత్స్యకారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. డీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించి వాటిని అడ్డు పెట్టుకొని వారిని వైసీపీ చేరతారా, లేకుంటే చస్తారా అంటూ ఎస్సై వేధించాడు. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం బంగారుపెంట తండాకు దశాబ్దాల కిందట విశాఖ నుంచి మత్స్యకారులు వలసొచ్చారు. చేపల వేట సాగిస్తూ, జీవనం సాగించే వీరికి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి.
వైసీపీ నాయకులు కొందరు తెలంగాణ మద్యాన్ని ఏపీలోకి తీసుకొస్తూ వీరి బోట్లు ఎక్కుతున్నారు. నిరాకరిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోలీసులు, సెబ్ అధికారులు దాడులు చేసినప్పుడు మద్యం అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ వారిని తప్పించి బోట్లు నడుపుతున్న మత్స్యకారులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు.
దుర్గారావు అనే మత్స్యకారుడిపై అలాగే అక్రమంగా కేసులు పెట్టి పదే పదే స్టేషన్‌కు పిలిపించేవారు. టీడీపీను వీడి వైసీపీలో చేరాలని ఒత్తిడి చేసేవారని, లేదంటే తనకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎస్సై వేధిస్తుండేవారని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అధికార పార్టీలో చేరలేదన్న కోపంతో వేధించేవారని, ఆ బాధలు భరించలేకే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మత్స్యకారుడిపై ఎస్సై ప్రవర్తించిన తీరుపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీలో చేరుతావా, చస్తావా??- ఎస్సై వేధింపులు తాళలేక మత్స్యకారుడు బలవన్మరణం