Nagari YSRCP Leaders Fire on Minister Roja : మంత్రి రోజాకు ఆమె సొంత నియోజకవర్గం నగరిలోనే అసమ్మతి సెగ తగులుతోంది. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. పార్టీ కోసం పని చేసిన వారిని మంత్రి రోజా పట్టించుకోవడం లేదని, ఆమె అన్న ఆధిపత్యం మితిమీరిపోయిందంటూ స్థానిక అసంతృప్తి నేతలు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. 'జగనన్న ముద్దు రోజా వద్దు' నినాదంతో ముందుకెళ్తామని తెలిపారు.
మంత్రికి ముచ్చెమటలు : వైఎస్సార్సీపీలో నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నగరి టికెట్ ఈసారి రోజాకు ఇవ్వరనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమె వ్యతిరేకులూ అసమ్మతి స్వరాలు పెంచుతూనే ఉన్నారు. ఈ తరుణంలోనే నగరి నియోజకవర్గం నుంచి మంత్రి రోజాకు వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా అవకాశం కల్పిస్తే ఆమెకు ఓటమి తప్పదని నియోజకవర్గంలోని ఆ పార్టీ నేతలు గత కొంత కాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. తిరుపతిలో వరుస మీడియా సమావేశాలతో రోజాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇటీవలే రోజా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసంతృప్తులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఎవ్వరూ చెప్పిన వినేది లేదు అన్నట్లుగానే వరుస మీడియా సమావేశారు నిర్వహించి మంత్రికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
సీఎం క్యాంపు కార్యాలయానికి చేరిన నగరి వర్గపోరు - జగన్‌కు రోజా ఫిర్యాదు
జగనన్న ముద్దు - రోజా వద్దు : తాజాగా మరోసారి వైసీపీ అసంతృప్త నేతల సమావేశం అయ్యారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. నగరిలో తాము ఐక్యంగా లేమని అసంతృప్తిగా ఉన్నామని ఆయన తెలిపారు. జగనన్న ముద్దు - రోజా వద్దు నినాదంతో ముందుకెళ్తామని తెలిపారు. నగిరి నియోజవర్గంలో రోజాకు మద్దతివ్వడానికి పార్టీ నాయకులు ఎవరూ సిద్దంగా లేమని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న రోజా అన్నదమ్ములు నగరిలో తిష్ట వేసి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలకు తీవ్రంగా నష్టపోయామని అన్నారు. పార్టీకి పని చేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.
మంత్రి రోజా సోదరుడు పుత్తూరు వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి కుమారస్వామిరెడ్డి పురపాలక ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని 40 లక్షల రూపాయలు తీసుకున్నారని పుత్తూరు 17వ వార్డు ఎస్సీ కౌన్సిలర్ భువనేశ్వరి జనవరిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నానికి నగరి పరిధిలోని జడ్పీటీసీ సభ్యులు మల్లీశ్వరి, మురళీధర్ రెడ్డి చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ రోజాపై విమర్శలు గుప్పించారు. 'రోజా వద్దు' అంటూ నినదించారు.
రోజాకు నగరి టికెట్ ఇస్తే ఓడిస్తాం: వైఎస్సార్సీపీ నేతలు
సీఎం జగన్ విఫలయత్నం : గత సంవత్సరం ఆగస్టు 28న సీఎం జగన్ నగరికి రాగా ఆయన ముందే వైఎస్సార్సీపీలోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. అధికార పార్టీ నేత కేజీ శాంతి, రోజా మధ్య సయోధ్య కుదిర్చేందుకు, వారిద్దరి చేతులను కలిపేందుకు సీఎం జగన్ విఫలయత్నం చేశారు. ఇప్పుడు టికెట్లు ఖరారు చేస్తున్నందున రోజా వ్యతిరేక గ్రూపులన్నీ దూకుడు పెంచాయి. ఆమెకు టికెట్ ఇవ్వకూడదని కుండబద్దలు కొడుతున్నాయి.
మంత్రి రోజాకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదు: నగరి వైఎస్సార్సీపీ నేతలు