Brahmani election campaign : గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళలకు ప్రాధాన్యమిచ్చే సంస్థలను స్థాపిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా బ్రాహ్మణి మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. మామిడికాయ పచ్చడి తయారు చేసే మహిళా కార్మికులతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. మహిళలతో కలిసి మామిడికాయ ముక్కలు కొట్టి పచ్చడి తయారు చేశారు. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలను మహిళలు నారా బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. నారా లోకేష్ మహిళలకి అధిక ప్రాధాన్యమిస్తారని, అధికారంలోకి రాగానే మీ సమస్యలను పరిష్కరిస్తారని బ్రాహ్మణి హామీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: నారా బ్రాహ్మణి - Brahmani in Election Campaign
మంగళగిరి మెయిన్ బజార్లో చెరుకు రసం తాగారు. రోజుకి ఎంత ఆదాయం వస్తుందంటూ చెరుకు రసం తయారు చేసే మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వర్ణాభరణాలు తయారు చేసే వ్యాపారులతో సమావేశం అయ్యారు. వ్యాపారంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెవి దిద్దులను కొనుగోలు చేశారు. వస్త్ర వ్యాపారులతో సమావేశమైన బ్రాహ్మణి గత ఐదారేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్లలో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని వ్యాపారులు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. ఇంకొక నెల రోజులు ఓపిక పడితే ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మీ సమస్యలను పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. తనకు నచ్చిన పసుపు రంగు చీరలను బ్రాహ్మణి కొనుగోలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో పర్యటించిన నారా బ్రాహ్మణి పూల తోటలో మహిళా కూలీలతో సమావేశమయ్యారు. వారితో కలిసి పూలు కోసి మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. పరిశ్రమలు పెట్టకపోవడంతో పిల్లలకు ఉపాధి లభించడం లేదన్నారు.
మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారుతాయి: నారా బ్రాహ్మిణి
రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని, మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం పరితపిస్తారని బ్రాహ్మణి వారికి తెలిపారు. మహిళలు, చేనేత కార్మికులు, రైతు కూలీలతో ముచ్చటిస్తూ ఆమె ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోక్శ్ చేపట్టిన కార్యక్రమాలను ఆమె ప్రజలకు వివరిస్తూ మంగళగిరి రూపురేఖలు మారాలన్నా ఏపీ అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు.