MP Kalishetty Presented Handloom Cloths to PM Modi: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధించిన మోదీ చిత్రాన్ని ఓ చేనేత కుటుంబానికి చెందిన దంపతులతో ప్రత్యేకంగా నేయించారు. ఈ కానుకను ప్రధానికి ఎంపీ అప్పలనాయుడు స్వయంగా అందజేశారు. ఎంపీ అప్పలనాయుడు సూచన మేరకు ఈ చిత్రాన్ని విజయనగరంలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం లావేరు మండలానికి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు సుమారు 40 రోజుల పాటు శ్రమించి ఈ వస్త్రాన్ని పూర్తి చేశారు.
మూడు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవు కలిగిన చేనేత వస్త్రంపై మోదీ చిత్రాన్ని ఆ దంపతులు తీర్చిదిద్దారు. బుధవారం స్వయంగా ఎంపీ అప్పలనాయుడు ప్రధాని మోదీకి ఈ చిత్రపటాన్ని అందజేయగా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున ఈ కానుక అందుకోవడం ఓ తీయని జ్ఞాపకంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 40 రోజులపాటు శ్రమించి ఈ వస్త్రాన్ని రూపొందించిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను ప్రధాని మోదీ అభినందించారని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. అంతేకాకుండా పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా మోదీకి అందజేసినట్లు ఎంపీ అప్పలనాయుడు తెలిపారు.
పదే పదే చెప్తున్నా అలా చేయొద్దు! - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CM Guidance to Ministers
అశోక్ గజపతిరాజు ఎలా ఉన్నారు?: పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇవ్వగానే నాలుగైదు పేజీలు తిరగేశారని ఆయన ఫొటోలను మోదీ పరిశీలనగా చూశారన్నారు. పుస్తకం బాగుంది అని ప్రశంసించారని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. పీవీజీ రాజు ఒక సామాజిక చైతన్యవేత్త అని ప్రధాని మోదీ కొనియాడారని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గురించి మోదీ అడిగారని తెలిపారు. అశోక్ గజపతిరాజు ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అని ఆరా తీశారని ఎంపీ కలిశెట్టి తెలిపారు. అశోక్ గజపతిరాజుని అడిగానని చెప్పాలని ఆయన్ని ఒకసారి రావాలని కూడా చెప్పమని మోది అప్పలనాయుడుకి సూచించారు. అలాగే మోదీకి పంచే కండువాతో కూడిన చేనేత వస్త్రాలను ఎంపీ అప్పలనాయుడు అందజేశారు.