Minister Payyavula Keshav comments on YS Jagan: ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అర్థికంగా దివాలా తీయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. 9 లక్షల కోట్లపైనే అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో దేశంలో రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఉండేదని ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం పేరు మారుమోగేదని పేర్కొన్నారు. జగన్ తన పాలనతో ఆ బ్రాండ్‌ను ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై రూపొందించిన శ్వేత పత్రాన్ని శాసన మండలిలో ప్రదర్శిస్తూ మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్ చేశారు. జగన్ పాలనలో ప్రతి వ్యవస్థనూ చిన్నాభిన్నం చేశారని తెలిపారు.
ఎఫ్ఆర్బీఎం నిబంధనలను యథేచ్చగా అతిక్రమించి పరిమితికి మించి అప్పులు చేశారని పయ్యావుల తెలిపారు. కాగ్ అధికారులకు సైతం ఫైళ్లు చూపించకుండా దాచిన ఘనత జగన్‌దేనని అన్నారు. తెలంగాణతో పోల్చితే రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో దారుణంగా వెనుకబడిందని తెలిపారు. వ్యవసాయం, విద్యుత్, సహా కీలక వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని ఆక్షేపించారు. జగన్‌కు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పయ్యావుల కేశవ్ ప్రకటన అనంతరం శాసన మండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోసేను రాజు ప్రకటించారు.
విద్యా శాఖలో పనిచేస్తోన్న ఒప్పంద అధ్యాపకులను నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టక పోవడం వల్లే వారి సర్వీసుల క్రమబద్దీకరణ చేయలేకపోతున్నట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. జీవో నెంబర్ 114కు అనుగుణంగా నిబందనల ప్రకారం ఒప్పంద అద్యాపకుల నియామకాలు చేపట్టలేదని మంత్రి తెలిపారు. నియామక విధానంలో 4 అంశాల్లో లోపాలున్నాయని దీనితో ఇబ్బందులు వస్తున్నట్లు శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సలహాను కోరినట్లు తెలిపారు. ఏజీ నివేదిక పంపిన అనంతరం అందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జగన్‌కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందని పయ్యావుల స్పష్టం చేశారు. అభిమానించినా అవమానించినా నిలదొక్కుకున్న వాళ్లే రాజకీయల్లో ఉండగలరని జగన్ గ్రహించాలని హితవు పలికారు. జగన్ ఇలాగే పోతే ఉన్న 11 మంది కూడా ఒక్కరయ్యే ప్రమాదముందని గ్రహించాలన్నారు. శ్వేతపత్రంలో చూపిన తొమ్మిదన్నర లక్షల కోట్ల అప్పు ఖచ్చితంగా పెరుగుతుందని వెల్లడించారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చలు కోసం దిల్లీ వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసి కోర్టులో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతారని ఎద్దేవా చేసారు. కనీసం 30 మంది ఎమ్మెల్సీలను మండలికైనా పంపితే వాస్తవాలు తెలుసుకునేవాళ్లని పేర్కొన్నారు. రాజకీయ హత్యలపై దమ్ముంటే జగన్ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేసారు.