Minister Anam RamaNarayana Reddy Comments on His Security : ప్రత్యర్థుల నుంచి తన భద్రత కోసం ఇకపై లైసెన్సుడ్ గన్ వాడాలని భావిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తన చుట్టూ ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉండటం వల్లే ఈ ఆలోచన చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని ఆనం నివాసంలో మండలాల వారీగా ఆత్మకూరు నియోజకవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. తన నివాసంలో జరిగిన మండలాల వారీ సమీక్షా సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకుడు పాల్గొనడం సందేహాలకు తావిస్తోందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
మంత్రికి భద్రత కట్టుదిట్టం : నెల్లూరు నగరంలోని ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో మండలాల వారీగా ఆత్మకూరు నియోజకవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన అనంతసాగరం మండల సమావేశంలో ఆనంకు అనుకోని సంఘటన ఎదురైంది. అదే మండలానికి చెందిన ఓ వైఎస్సార్సీపీ నేత, అయ్యప్పమాల ధరించి ఆనం సమావేశానికి హాజరయ్యారు. చాలాసేపు సమావేశంలోనే కుర్చోని అన్ని పరిశీలిస్తున్న ఆ నాయకుడిని గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఊహించని ఈ సంఘటనపై విచారిస్తున్న పోలీసులు మంత్రికి భద్రత కట్టుదిట్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నా తన భద్రతను తొలగించారని, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తనకు నిబంధనల ప్రకారం భద్రత ఇస్తున్నారని ఆనం తెలిపారు. అయితే తన చుట్టూ ఏదో జరుగుతోందన్న అనుమానం ఉండటంతో లైసెన్స్ గన్తో తిరగాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.