Meeting at NTR Bhavan on Thiruvuru MLA Kolikapudi Issue: తిరువూరు పంచాయతీ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఓ కొలిక్కి వచ్చింది. తన పనితీరు వల్ల కొందరికి ఇబ్బందులు కలుగుతాయని ఊహించలేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధిష్టానానికి వివరించారు. తన వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిచేసుకుంటానని స్పష్టం చేసారు. సమన్వయలోపం సరిదిద్దుకుంటూ కేశినేని చిన్నీ నేతృత్వంలో పని చేస్తానని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో తిరువూరులో కార్యకర్తల సమావేశం పెట్టాలని నిర్ణయించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
వరుస ఫిర్యాదులతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ని పార్టీ అధిష్టానం పిలిపించింది. కొలికపూడితో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని శివనాథ్, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజులు సమావేశమై, తిరువూరులో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై వివరణ కోరారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారన్న ఎంపీ కేశినేని చిన్ని చిన్నపాటి సమస్యల వల్ల పార్టీకి, చంద్రబాబుకు చెడ్డపేరు రాకూడదని నిర్ణయించామన్నారు.
పార్టీ బలోపేతం, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం అందరూ కలిసి ముందుకెళ్లేలా రేపు తిరువూరులో జరిగే సమావేశంలో చర్చించుకుంటామని ఎంపీ కేశినేని వెల్లడించారు. క్యాడర్ని కలుపుకుపోతూ పార్టీని మరింత బలోపేతం చేసేలా రేపటి సమావేశం జరగనుందని తెలిపారు. ఏ పార్టీలో అయినా చిన్న చిన్న సమస్యలు సహజమని అవి కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయేవే అన్నారు. తిరువూరు సమస్య చిన్నపాటి కుటుంబ సమస్య అని కృష్ణా-గుంటూరు జిల్లాల తెలుగుదేశం సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. రేపు తిరువూరులో జరిగే కార్యకర్తల సమావేశంలో అన్నీ సమసిపోతాయని ఆకాంక్షించారు.
మీడియా ప్రతినిధులు సీఎంకు ఫిర్యాదు: ఇటీవల మీడియా ప్రతినిధులు కొలికపూడిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధులను కించపరిచేలా కొలికపూడి మాట్లాడుతున్నారని తెలిపారు. కొలికపూడి బెదిరించారంటూ కొన్ని ఆధారాలను చంద్రబాబుకు అందజేశారు. తనకు అన్ని విషయాలు తెలుసన్న చంద్రబాబు వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని మీడియా ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
మహిళలు నిరసన: మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్న కొలికపూడిని టీడీపీ అధిష్ఠానం సస్పెండ్ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరువూరు మండలంలోని చిట్టేలలో ఇటీవల మహిళలు నిరసన చేపట్టారు. మహిళల పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.