Kadiyam Srihari Joined Congress Today : లోక్‌సభ ఎన్నికల ముందు గులాబీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక నాయకులు పార్టీని వీడితుండటంతో అధిష్ఠానం అయోమయంలో పడింది. ఇప్పటికే పలువురు కీలక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. ముందే ప్రకటించిన విధంగా ఇవాళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య (Kadiyam Kavya) హస్తం గూటికి చేరారు.
Kadiyam Kavya joined congress party : ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి కడియం శ్రీహరి, కావ్య వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ వారికి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి కడియం శ్రీహరి లేదా కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్తున్నారు. పెండింగ్‌లో ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు, హైకమాండ్‌తో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మరోవైపు త్వరలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
తెలంగాణలో బీఆర్ఎస్ వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవకముందే నాయకులంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా వివిధ స్థాయిలోని వారు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా, ఇంకా కొంతమంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. మరికొందరు కూడా తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.