Janasena Chief Pawan Kalyan Election Campaign : రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు పవన్ కల్యాణ్ పాల్గొని ఉమ్మడి ప్రచారం నిర్వహించారు.
3 పార్టీల బలం కావాలి : బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైఎస్సార్సీపీ కేబినెట్‌లో ఉన్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు ? ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారని అన్నారు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడీ చేసే వ్యక్తి జగన్. అధికార పార్టీ నేతలు దోచుకున్న డబ్బుతో పక్క రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టుకున్నారని ఆరోపించారు. ఇక్కడ పెట్టినా కనీసం యువతకు ఉపాధి దొరికేదని అన్నారు. ధాన్యంలో మొలకలు వచ్చాయని రైతు ఏడుస్తుంటే ఇక్కడి మంత్రి బూతులు తిట్టారని, ఎంత అహంకారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసైనికుల ఒంటిపై పడిన దెబ్బ ఇంకా మర్చిపోలేదని ఈ మంత్రిని హెచ్చరిస్తున్నానని అన్నారు. జగన్ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు వస్తాయని తెలిపారు. ఐదు కోట్ల మందికి ఒకరిద్దరు సరిపోరు 3 పార్టీల బలం కావాలని, కేంద్రం సహాయ సహకారాలు రాష్ట్రానికి కావాలని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఒడిదొడుకులు ఎదుర్కొన్న నాయకుడు చంద్రబాబు, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరమని అన్నారు.
చంద్రబాబు కూడా తగ్గారు : తణుకులో జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా వెనక్కి తగ్గామని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. బీజేపీ కోసం అనకాపల్లి ఎంపీ సీటును వదులుకున్నామని, చంద్రబాబు కూడా తగ్గారని, రాష్ట్ర ప్రజల కోసమే ఇదంతా చేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.
ఆడపిల్లలకు భద్రత కల్పించే సమాజం : నిడదవోలు సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ఉమ్మడిగా నిలబడాలని పిలుపునిచ్చారు. రౌడీరాజ్యం పోవాలని, రామరాజ్యం రావాలని, ధర్మం నిలబడాలని తెలిపారు. వివేకాను చంపిన హంతకులను వెనకేసుకొస్తున్నారని, వారి కుటుంబసభ్యులకే రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఆడపిల్లలకు భద్రత కల్పించే సమాజం కోరుకుంటున్నామని అన్నారు. సీపీఎస్‌కు పరిష్కార మార్గం కనుక్కుంటామని హామీ ఇచ్చారు.