TDP Seniors Tension over IVRS Survey: గెలుపు గుర్రాల కోసం తెలుగుదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. తొలి జాబితాలో 94 మంది పేర్లు ప్రకటించిన ఆ పార్టీ మిగిలిన స్థానాల్లో నూ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. తాజా ఐవీఆర్ఎస్ సర్వే తొలి జాబితాలో సీటు దక్కని సీనియర్లను టెన్షన్ పెడుతోంది. పెనమలూరులో దేవినేని ఉమామహేశ్వరరావు, నరసరావు పేటలో యరపతినేని శ్రీనివాసరావు, గురజాలలో జంగా కృష్ణమూర్తి పేరుతో సర్వే జరుగుతోంది. ఆదివారం ఎం. ఎస్. బేగ్ పేరుతో పెనమలూరులో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు.
సర్వేపల్లిలో పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ఆనం పేరుతో ఇటీవల మూడు చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆనం పేరుతో వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరుల్లో సర్వేలు చేశారు. చింతమనేని కుమార్తె పేరుతో దెందులూరులో ఐవీఆర్ఎస్ సర్వే జరిగింది. కళా, పీలా గోవింద్, బండారు సత్యనారాయణ మూర్తి, జవహర్‌కు ఇంకా స్పష్టత రాలేదు. తొలి జాబితాలో చోటు దక్కని ఉంగుటూరు ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కంభంపాటి రామ్మోహన్ రావు, నిమ్మల కిష్టప్ప కలిశారు. కంభంపాటి ఏలూరు ఎంపీ, కిష్టప్ప పెనుగొండ అసెంబ్లీ సీటు ఆశించారు. తొలి జాబితాలో పెనుగొండ టిక్కెట్ సవితకు కేటాయించారు. జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కిష్టప్ప చంద్రబాబును కోరారు
టీడీపీ తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఇంఛార్జి శంకర్‌యాదవ్‌కే సీటు కేటాయించాలంటూ స్థంభాలపల్లి నుంచి దాదాపు 10 బస్సుల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. తొలి జాబితాలో స్థంభాలపల్లి నియోజకవర్గానికి జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా అధినేత చంద్రబాబు ప్రకటించారు. జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉండవల్లి కరకట్టపై శంకర్‌యాదవ్ అనుచరులు నిరసన తెలిపారు. చంద్రబాబు నివాసం వద్దకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. దీంతో శంకర్‌యాదవ్ అనుచరులు, చంద్రబాబు నివాసం ప్రధాన గేటు వరకూ చొచ్చుకెళ్లి కొద్దిసేపు తమ నిరసన కొనసాగించారు. పార్థసారధి చేరిక సందర్భంగా ఆయనతోపాటు చంద్రబాబు నివాసానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరావడంతో నిరసనకారులు, మద్దతుదారులను గుర్తించడం భద్రతా సిబ్బందికి కష్టతరమైంది.
'వారసులొస్తున్నారు'- ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా ముందడుగు!
మాజీ ఎంపీ బికే పార్దసారధి తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిశారు. బీకే పార్దసారధి పెనుగొండ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. అనంతపురం లోక్ సభ నుంచి పోటీ చేయాలని బీకేకు చంద్రబాబు సూచించారు. గత నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గంలో తాను చేసిన పనులను బీకే వివరించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వ్యక్తిని కాదని తెలిపారు. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి కచ్చితంగా గెలుస్తారని సర్వే రిపోర్టులు వచ్చాయని బీకే పార్దసారధితో చంద్రబాబు అన్నారు. దీంతో చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని బీకే పార్దసారధి వెల్లడించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనకు దైవ సమానులని తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. తాను టిక్కెట్ ఆశించాను, అవకాశం కోరుతున్నానని ఆయన తెలిపారు. చంద్రబాబుకు రామబంటు అనే పదం తన జీవితంలో నిలబెట్టుకుంటానన్నారు. మొన్న జాబితాలో తన పేరు లేకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. తన కష్టం గుర్తించి టిక్కెట్ ఇవ్వాలని బుద్దా వెంకన్న కోరారు. విజయవాడలో బుద్దా వెంకన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
టీడీపీ, జనసేన పొత్తు పొడిచింది - వైఎస్సార్సీపీ జడిసింది!
ఉత్కంఠ వీడేనా - ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎవరు?