Betting On Andhra Pradesh Elections Results 2024 : రాష్ట్రంలో ఈసారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందెం వేసి నెగ్గితే వారికి (ఒకటికి నాలుగు) రూపాయికి రూ.4 చొప్పున ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు.
టీడీపీ ఒక్క పార్టీకే 89-92 సీట్లు : 'గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. చరిత్ర సృష్టించబోతున్నాం' అంటూ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్జి ఇటీవల స్వయంగా ప్రకటించారు. తర్వాత ఆ పార్టీ నేతలు రెండు అడుగులు ముందుకేసి జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ మాటలేవీ పందేలపై ప్రభావం చూపించడం లేదు. ఫిబ్రవరి మొదట్లో వైఎస్సార్సీపీకి 60 సీట్లొస్తాయంటూ పందేలు మొదలైతే జగన్ ప్రచారం ముగిసే సమయానికి ఆ సంఖ్య 75 వరకు వచ్చింది. ఈ నెల పోలింగ్ తర్వాత అది మళ్లీ 70కి తగ్గిన పరిస్థితి. ఇప్పుడు వైకాపా 70 నుంచి 73 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందనే దానిపై పందేలు నడుస్తుండడం గమనార్హం.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఒక్క పార్టీకే 89-92 సీట్లు వస్తాయి. కూటమికి 104-107 సీట్లు వస్తాయంటూ పందేలు నడుస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశాక కూడా వైఎసార్సీపీ విజయంపై పందేలకు ఆ పార్టీ సానుభూతిపరులతో సహా, ఇతర పందెం రాయుళ్లు ఆసక్తి చూపడం లేదు. పైగా వైఎస్సార్సీపీ విజయం, ఆ పార్టీకి వచ్చే మెజారిటీపై కాకుండా కూటమి విజయం, కూటమి ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందనే అంశాలపైనే ఇప్పుడు పందేలు జోరందుకున్నాయి.
వైఎస్ షర్మిల, నారా లోకేశ్ సీట్లపై హాట్‌హాట్‌గా : పందేలు చట్టవిరుద్ధం. అయినప్పటికీ పార్టీల విజయావకాశాలు, మెజారిటీలపై అవి నడుస్తూనే ఉన్నాయి. భీమవరం కేంద్రంగా రూ.150 కోట్ల విలువైన బెట్టింగ్‌లు నడుస్తున్నా అక్కడ వైఎస్సార్సీపీ గెలుస్తుందని పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గాలు, ప్రముఖులు పోటీలో ఉన్న స్థానాలు, వారి విజయావకాశాలు, మెజారిటీలపై బెట్టింగులు నడుస్తున్నాయి. 'కడప లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయి? గెలుపుపై కూడా జోరుగా పందేలు నడుస్తున్నాయి. పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో గెలుపు ధీమాపై ఇరుపార్టీల నాయకులు పందేలు కాస్తున్నారు. పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గుతుందని జోరుగా పందెం కాస్తున్నారు.
రఘురామ కృష్ణరాజు : ఉండి స్థానంలో టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజుకు ఎంత మెజారిటీ వస్తుంది? ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి శివరామరాజుకు 25 వేల నుంచి 40 వేలలోపు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం తణుకు టీడీపీ అభ్యర్థే విజయం సాధిస్తారు' అని పందేలు నడుస్తున్నాయి. మంగళగిరి విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ లోకేశ్ ఓడిపోతారని పందెం కాసి, గెలిస్తే వారికి ఒకటికి రూ.5 చొప్పున ఇస్తామని సవాలు విసురుతున్నారు.
ఏపీలో గెలిచేదెవరో తెలుసా?- భారీ పోలింగ్ వెనుక కారణాలేంటి? - AP ELECTION RESULT