Madanapalli Fire Accident Case Update : వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసే లక్ష్యంతో ఐదేళ్ల పాటు సాగిన అరాచకపాలన సాక్ష్యాలను చెరిపివేస్తూ నిజానికి నిప్పు పెట్టిన ఘటనపై ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది . కుట్రకోణంపై దర్యాప్తునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పది బృందాలు తమ పరిశోధన ప్రారంభించాయి. పోలీసు ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, అగ్నిమాపక, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఫోరెన్సిక్ విభాగాల ఉన్నతస్థాయి బృందాలు విచారణ నిర్వహించాయి.
బీరువాలో ఇంజిన్ ఆయిల్: ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగి 22A, చుక్కల భూముల దస్త్రాలు భద్రపరిచే గదులు తగులపడిపోయిన ప్రాంతాన్ని ఉన్నతస్థాయి బృందాలు పరిశీలించాయి. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జెన్‌కో జేఎండీ చక్రధరరావు, ట్రాన్స్‌కో సీఎండీ కీర్తితో పాటు పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయ సీనియర్ సహాయకుడు గౌతమ్ కార్యాలయ బీరువాలో ఏడు లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఉంచినట్లు విచారణలో తెలిపారు. అంత మోతాదులో ఆయిల్ ఎందుకు కార్యాలయానికి తెచ్చారు? అందులోనూ బీరువాలోనే పెట్టాల్సిన అవసరమేమిటి అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదని తెలిసింది.
ఘటనకు పెట్రోలు, డీజిల్ వినియోగించలేదనే ప్రాథమిక అభిప్రాయానికి ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు వచ్చారు. గౌతమ్ ఇచ్చి సమాచారంతో ఇంజిన్ ఆయిల్ తెచ్చిన కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఇతర విషయాల్లో ఆయన విచారణకు సహకరించడంలేదని సమాచారం. గౌతమ్ ఆదివారం రాత్రి 10గంటల 40 నిమిషాల వరకు కార్యాలయంలో ఉన్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా బయటపడింది. ఆ తరువాత 11 గంటల 27 నిమిషాలకు మంటలు కనిపించినట్లు ఫుటేజీ ద్వారా తెలిసింది. కార్యాలయంలో కాపలాగా ఉన్న నిమ్మనపల్లె వీఆర్‌ఏ రమణయ్య ఘటనకు పది అడుగుల దూరంలోనే పడుకుని ఉన్నట్లు సమాచారమిచ్చారు.
తాను 9.30 గంటలకే నిద్రపోయినట్లు చెబుతున్నారు. ఇతని సమాధానాలపై పోలీసులు అనుమానిస్తున్నారు. కాలిపోయిన కంప్యూటర్లు, దస్త్రాల బూడిదను, కాలకుండా ఉండిపోయిన వాటిని వేర్వేరుగా సేకరించి పరీక్షల నిమిత్తం సీజ్ చేశారు. పూర్వ ఆర్డీవో మురళి మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసి డేటాను పరిశీలిస్తున్నారు. మురళి రెండురోజులపాటు మదనపల్లెలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం ఆయన్ను పలు కోణాల్లో విచారించారు. ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్ సైతం అదుపులో ఉండగా ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో పెద్దిరెడ్డి అనుచరుడు: మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక అనుచరుడు మాధవరెడ్డి పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని మదనపల్లె పరిసరాల్లో భూదందాలన్నీ సాగించారు. కబ్జా చేసిన భూములు కొన్నింటిని పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట రాయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకే మదనపల్లె మండలం బండమీద కమ్మపల్లె వద్ద భూములు స్వర్ణలత పేరిట కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా డీకేటీ భూములు స్వాహా చేసి కొనుగోలు పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దస్త్రాలు కనిపిస్తున్నాయి. భారీగా అక్రమ వ్యవహారాలు బయటపడే అవకాశం ఉందనే భయంతో దస్త్రాలు తగలబెట్టారనే అనుమానాలున్నాయి.
ఈ నేపథ్యంలో మాధవరెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులుండగా వారి కన్నుగప్పి ఆయన పరారయ్యారు. ఆయన నివాసంలో రెండు సంచుల్లో ఉన్న దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి పరారీ సంచలనంగా మారింది. పెద్దిరెడ్డి ఆరాచకాలను బలైన పలువురు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు కాలిపోయిన తరుణంలో వాటి మూలాల కోసం డివిజన్ పరిధిలోని 11 మండలాలకు కీలక అధికారుల బృందాలు చేరుకున్నాయి. సోమవారం రాత్రంతా తహసీల్దార్ కార్యాలయాల్లో పరిశీలించి దస్త్రాలన్నింటినీ స్వాధీనం చేసుకుని కలెక్టర్ కార్యాలయానికి తరలించాయి.