EX- Deputy CM Alla Nani to join Telugu Desam Party : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఏలూరు జిల్లా నేతలకు తెలుగుదేశం అధిష్ఠానం పిలుపునిచ్చింది. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా మెలిగిన నాని గతంలోనే వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
గత ఎన్నికల్లో నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తర్వాత ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా, చివరకు టీడీపీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆళ్ల నానికి అత్యంత సన్నిహితుడు, విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీ పెద్దలతో మంతనాలు జరిపి అధిష్ఠానాన్ని ఒప్పించినట్లు తెలిసింది. నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆళ్ల నాని - Alla Nani Resign to YSRCP