Doctor Chaitanya Reddy Met Viveka Murder Case Approver Dastagiri: వివేకానందరెడ్డి హత్యకేసు(YS Viveka Murder Case)లో అయిదో నిందితుడు శివశంకర్‌రెడ్డి(A5 Shivashankar Reddy) కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ(CBI) పలుమార్లు పేర్కొంది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆయన కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డి అప్రూవర్ దస్తగిరి వద్దకు వెళ్లి 20 కోట్ల రూపాయలు ఇస్తానంటూ ఆఫర్ చేశారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి.
ఖైదీలకు వైద్యశిబిరం పేరుతో డాక్టర్ చైతన్యరెడ్డి తనతో సమావేశమై 20 కోట్ల రూపాయులు ఆఫర్ చేశారని దస్తగిరి బాహాటంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలో హత్యకు గురయ్యారు. హత్య కుట్రలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది.
ఏపీలో ప్రాణహాని ఉంది - రక్షణ కల్పించండి: తెలంగాణ సీఎంకు దస్తగిరి విజ్ఞప్తి
ఈ హత్య కోసమే దస్తగిరికి కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. హత్య కోసం డబ్బులు డీల్ చేసిన వ్యక్తి శివశంకర్‌రెడ్డేననిసీబీఐ తేల్చింది. ఈ కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరి అప్రూవర్(Viveka Murder Case Approver Dastagiri)గా మారి ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న దస్తగిరిని గతేడాది అక్టోబరు 31న అట్రాసిటీ కేసులో అరెస్టు చేసి కడప జైలుకు పంపారు.
హైకోర్టు బెయిల్ ఇచ్చినా వేముల పోలీసులు దాడి కేసు నమోదు చేసి పీటీ వారంట్ కింద అరెస్టు చేశారు. కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈనెల 23న జైలు నుంచి విడుదలయ్యారు. దస్తగిరి జైలులో ఉన్నప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైతన్యరెడ్డి జైల్లో ఖైదీలకు వైద్యశిబిరం పేరుతో బ్యారెక్‌లో ఉన్న దస్తగిరిని నవంబరు 18న కలిసినట్లు సమాచారం.
చావుకైనా సిద్ధం - సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన దస్తగిరి
తమకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టి అప్రూవర్‌గా మార్చినట్లు చెప్పాలని చైతన్యరెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు దస్తగిరి వెల్లడించారు. 20 కోట్ల రూపాయలు ఇస్తానంటూ తనకు ఆఫర్ చేసినట్లు వివరించారు. వివేకా హత్యకేసులో శివశంకర్‌రెడ్డి పాత్ర లేకపోతే ఆయన కుమారుడు ఇంత మొత్తం ఆఫర్ చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇదంతా వెనకుండి ఎవరు నడిపిస్తున్నారనే విషయాలపై సీబీఐ విచారణ చేయాలని దస్తగిరి డిమాండ్ చేస్తున్నారు. చైతన్య రెడ్డి కడపలో 2022 మే 26న ఆసుపత్రి ప్రారంభించారు. ఆయన కంటే ఎంతోమంది ప్రముఖ వైద్యులున్నా చైతన్యరెడ్డినే ఎందుకు ఎంచుకున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జైలులో జరిగిన వ్యవహారంపై సీబీఐని త్వరలో దస్తగిరి కలిసి వివరించనున్నట్లు తెలిసింది.