Pawan Kalyan Speech in Palle Panduga : ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధులు కేటాయింపుపై డిస్ ప్లే బోర్టులు ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తాము పారదర్శకంగా ఉన్నప్పటికీ వ్యవస్థలో కూడా అధికారులు బాగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి తమ పేరు చెప్పి డబ్బులు అడిగినట్లు తన దృష్టికి రాగానే విచారణ చేసి, అవసరమైతే సస్పెండ్ చేయండని చెప్పామన్నారు. అవినీతి అధికారులు తమకు వద్దు లంచం పేరుతో ఎవరు ఇబ్బంది పెట్టినా తమ దృష్టికి తీసుకురావాలని పవన్ స్పష్టం చేశారు.
తాము ప్రజలకు సేవ చేయడానికే వచ్చామని, అభివృద్ధి చేస్తామని తెలిపారు. కంకిపాడులో కూడా డిస్ ప్లే బోర్డులు ఉంటాయి ప్రజలు అందరూ తెలుసుకోవచ్చని అన్నారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున గ్రామ సభలు, అభివృద్ది పనులు ఒకేసారి జరగడం ఏపీలోనే చూస్తున్నామన్నారు. అన్ని గ్రామ పంచాయతీ వారోత్సవాలలో పనులు నేటి నుంచి ప్రారంభం అయ్యాయని పవన్ తెలిపారు. పనులు పూర్తి కావాలంటే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
"పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాల"ను డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో లాంచనంగా ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ వందరోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.
14 నుంచి 20 వరకు 'పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు' - పవన్ ఆదేశాలు
కంకిపాడు గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 95.15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 11 అంతర్గత సిమెంటు రహదారులు రెండు మినీ గోకులాల నిర్మాణానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. పునాదిపాడు గ్రామపంచాయతీలో 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 2 అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పునాదిపాడు గ్రామంలో 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పరిపాలన ఎలా చేయాలనే అంశంలో తనకు చంద్రబాబు స్పూర్తి అని అన్నారు. కేబినెట్ సమావేశాల్లో చంద్రబాబు చాలా బలంగా మాట్లాడతారని, అధికారులు లేవనెత్తే సందేహాలకు కూడా చంద్రబాబు చెప్పే సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 30వేల పనులు చేయాలంటే ఎన్నో శాఖల సహకారం, సమన్వయం తప్పని సరి అని అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు చిత్తశుద్ది ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. పది శాఖలు అధికారులు కలిసి సమన్వయంతో పని చేసి లక్ష్యాలను చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ ఉపాధి హామీ పధకం రాష్ట్ర అభివృద్దిలో కీలకమైనదని అన్నారు. ఏడాదికి 10వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పధకం కింద వస్తాయన్నారు. దశాబ్దన్నర క్రితమే ఒక వ్యక్తికి రోజు పని కల్పించాలని ఈ పథకం తెచ్చారన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని పని చేస్తే 270 రూపాయలు రోజుకు ఇస్తారన్నారు. 15 రోజుల్లో మీకు పని కల్పించలేకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలని అన్నారు. మీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎలా పని చేస్తారో మీ అందరికీ తెలుసని అన్నారు. కంకిపాడు నుంచి రొయ్యూరు వరకు ఉన్న రోడ్ నవీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎదురు చూస్తున్న పల్లె పండుగ వచ్చేసింది! పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు-బీటీ రోడ్లకు మోక్షం
4500 కోట్ల రూపాయలతో పనులు: ఆగస్టు 23న గ్రామ సభలలో తీర్మానం చేసిన పల్లె పండుగకు ఈరోజు శంకుస్థాపన చేశామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఒక పని మొదలు పెట్టడం తేలిక, పూర్తి చేయడం కష్టమని, బలమైన అధికారుల అండదండలు ఉంటేనే ఇది సాధ్యమని అన్నారు. ఐఏఎస్ అధికారులు శశిభూషణ్, కృష్ణతేజ, డికె బాలాజీ, షణ్ముఖ కుమార్, బాలా నాయక్, విజయ్ కుమార్ వంటి వారు తన ఆలోచనలకు అనుగుణంగా పనులు చేపట్టారని పవన్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యాన 4500 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామన్నారు. తమ ఆకాంక్ష పల్లెల్లో వెలుగు రావాలి, ఏపీ అభివృద్ధి చెందాలని భావించామని, అందుకే కూటమి పక్షాన అందరం కలిసి నిలబడ్డామన్నారు.
ఎన్నో దెబ్బలు తిని ఎదుర్కొని ఎన్నికలలో ప్రజల అభిమానం పొందామని తెలిపారు. రాష్ట్రానికి బలమైన నాయకత్వం కావాలి, అనుభవజ్ఞులు అవసరమని అన్నారు. చంద్రబాబునాయుడికి ఉన్న అపారమైన పరిపాలనా అనుభవం తమకు ఎంతో బలమని అన్నారు. రాష్ట్ర శ్రేయస్సుకు ఆయన అనుభవం ఉపయోగించుకోవాలనేదే తన అభిప్రాయంగా పవన్ పేర్కొన్నారు. ఆరోజు తాను తీసుకున్న నిర్ణయం సరైనదని ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తే అర్థమవుతోందన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతల సహకారంతో కూటమిసభ్యులు అంతా రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడ్డామన్నారు.
ప్రభుత్వ పనిలో గుట్టు ఎందుకు?: గత ప్రభుత్వ పాలనలో అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదని విమర్శించారు. ఏ రోజూ గ్రామ సభలు, తీర్మానాలు చేయలేదని, డబ్బులు మాత్రం ఏమయ్యాయో తెలియదని అన్నారు. తాను వచ్చాక రివ్యూ చేసినా కూడా ఆ నిధుల జాడ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తాము శాఖల వారీగా సమీక్షలు చేసి, జరిగిన వాస్తవాలు చెప్పాలని భావించామన్నారు. ప్రభుత్వ పనిలో గుట్టు ఎందుకు? అంతా పారదర్శకంగా ఉండాలని అన్నారు. గ్రామ సభల్లో 30వేల పనులు, 4500 కోట్ల నిధులు అనేవి వారి గ్రామాల కోసం ప్రజలే తీర్మానించుకున్న అంశాలని పవన్ తెలిపారు.
వైఎస్సార్సీపీ పాలనలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎప్పుడైనా ప్రజల సమస్యలపై ఇలా స్పందించారా? అని డిప్యూటీ సీఎం పవన్ నిలదీశారు. ఎంతసేపు వారి నోటి వెంట బూతులు, తిట్లు తప్ప ప్రజల సమస్యల పరిష్కారంపై వారికి చిత్తశుద్ధి లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలే అజెండాగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారన్నారు. ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి చూస్తామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చిత్తశుద్ధితో మన రాష్ట్రంలో పని చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వంద రోజుల ఉపాధి హామీ పథకం కల్పించడంతో పాటు, ఆర్థికంగా ఎదగాలని అన్నారు.
ఆగస్టు 23న ఆమోదించిన అన్ని పనులకు కలెక్టర్లు అనుమతులు ఇచ్చారని, ఈరోజు పండుగ వాతావరణంలో భూమి పూజ చేసుకున్నామన్నారు. సంక్రాంతి నాటికి పూర్తి చేసి, మరోసారి పల్లెల్లో పండుగ చేసుకుందామన్నారు. పవన్ దగ్గరే డబ్బులు ఉన్నాయని చంద్రబాబుకు అధికారులు చెప్పారంట, తాను ఆరా తీస్తే ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా వచ్చే పది వేల కోట్ల నిధులు కేంద్రం పేదల కోసం ఈ పథకం ద్వారా అమలు చేస్తుందని అన్నారు. అందుకే ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పవన్ కోరారు.