CM Chandrababu Worked as Servant : ఎవరూ అధైర్యపడొద్దు! అంతా సెట్‌రైట్ అయ్యేవరకూ ఇక్కడే ఉంటా. ఇదీ పది రోజుల క్రితం విజయవాడలో వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన అభయం. అన్నమాటను ఆచరించి చూపారాయన. అసాధారణ వర్షాలకు బుడమేరుకి గండ్లు పడి విజయవాడ నగరంలోని అనేక కాలనీలను ముంచెత్తింది. లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అది మొదలు విజయవాడలోని కలెక్టరేటే సీఎం క్యాంపు కార్యాలయమైంది. మినీ సచివాలయంగా మారిపోయింది. బస్సే సీఎం ఇల్లైంది.
శెభాష్ అనిపించుకున్న చంద్రబాబు : ఈ నెల ఒకటో తేదీ నుంచే కలెక్టరేట్‌లో మకాం వేశారు చంద్రబాబు. వరద సహాయక చర్యలను అక్కడి నుంచే పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో అమలునూ స్వయంగా ఏరోజుకారోజు స్వయంగా పరిశీలించారు. వరదల్లో రాకపోకలు ఇబ్బందికరమైనా ఆయన వెనక్కి తగ్గలేదు. బోట్లపైనే బాధిత ప్రాంతాలకు వెళ్లారు. మొదటి రోజు రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు. వరద కొంచెం తగ్గాక కార్లు తిరిగే పరిస్థితి లేకపోతే ప్రొక్లైన్‌పైనే ముంపు ప్రాంతాల్ని చుట్టేశారు. 74 ఏళ్ల వయసులోనూ రోజూ ఐదారు గంటల పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సత్వరసాయం అందేలా చేశారు. మోకాళ్లలోతు నీటిలోనూ తిరిగారు. కష్టమొస్తే ప్రభుత్వంపై అసహనం, కోపం, నిరుత్సాహంతో విరుచుకుపడే బాధితుల ఆక్రోశాన్నీ అర్ధం చేసుకుని, రోజులు గడిచేకొద్దీ వారితోనే శెభాష్ అనిపించుకున్నారు.
ఆన్‌లైన్ కంట్రోల్ రూం ద్వారా సీఎం పర్యవేక్షణ : బుడమేరు ఎంత వేగంగా చుట్టుముట్టిందో అంతే వేగంగా పునరావాస చర్యలు చేపట్టారు చంద్రబాబు.కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడి పదుల సంఖ్యలో పవర్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ సేనల్ని రప్పించారు. ముంపు బాధితుల్ని తొలుత సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో వారికి అన్నపానీయాలు అందించారు. ఇళ్లు వదిలి బయటకు రాలేనివారికి భోజనం, బిస్కెట్ ప్యాకెట్లు బోట్లు, హెలికాప్టర్లు ద్వారా పంపించారు. అవి కూడా వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపి వరద సహాయ చర్యల్లో వినూత్న ఒరవడి సృష్టించారు.
పది రోజులుపాటు ముప్పుటలా ఆహారం, పాలు, నీళ్ల సీసాలు, బిస్కట్ ప్యాకెట్లు ఇలా ప్రతీదీ అందేలా చూశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ఫుడ్ స్టాక్‌పాయింట్‌గా చేసుకుని, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఆహారం, ఇతర వస్తువులు బాధితులకు చేరేలా చేశారు. జిల్లాల నుంచి వచ్చే ఆహారాన్ని ఏఏ ప్రాంతాలకు పంపాలి, ఇంటింటికీ ఎలా చేరవేయాలో ఆన్‌లైన్ కంట్రోల్ రూం ద్వారా సీఎం పర్యవేక్షించారు.
నామమాత్రపు ధరలకు కూరగాయలు : ముంపు ప్రాంతాల్లో చివరి వ్యక్తికీ ప్రభుత్వ సహాయం అందాలన్నది చంద్రబాబు అభిమతం. దాని కోసం ఆయన మంత్రులు, యంత్రాంగాన్ని మోహరించారు. ఐఎఎస్, ఐపీఎస్‌లనూ కార్యాలయాల నుంచి కార్యక్షేత్రంలోకి పంపారు. 32 వరద పీడిత డివిజన్లకు ఒక్కో సీనియర్ ఐఏఎస్ చొప్పున నియమించారు. 179 సచివాలయాలకు 179 మంది ఇంఛార్జుల్ని పెట్టారు. వరద వీడుతున్న ఒక్కో ప్రాంతాన్ని సాధారణ స్థితికి తెస్తూ వచ్చారు.
రాష్ట్రంలోని అగ్నిమాపక శకటాలన్నీ విజయవాడకు తెప్పించి ఇళ్లు శుభ్రం చేయించారు. రేషన్ సరఫరా వాహనాలతో ఆయా ప్రాంతాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయించారు. వరద బాధితుల్ని దళారులు దోచుకుతినకుండా నామమాత్రపు ధరలకు ఆటోల ద్వారా కూరగాయలు అమ్మించారు. ఐవీఆర్ఎస్ విధానంలో రోజూ బాధితులకు అందుతున్న సాయంపై అభిప్రాయాలు స్వీకరించి లోపాల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు.
6,880 కోట్ల మేర నష్టం : బుడమేరుపై బెజవాడ వాసుల్లోని భయాన్ని పోగొట్టి వరద బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకునేలా చేశారు. జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడుని మూడు రోజుల పాటు కాలువ గట్టుపైనే ఉంచి బుడమేరు గండ్ల పూడ్పించారు. వరద బాధిత ప్రాంతాల్లో రోగాలు పంజా విసరకుండా డ్రోన్లతో బ్లీచింగ్ రసాయనాలు చల్లించారు. మెడికల్ క్యాంపులు పెట్టించారు. వరదలకు దెబ్బతిన్న ఎలక్టాన్రిక్ వస్తువులు, ఇతర గృహోపకరణాల్ని మరమ్మతు చేయించేందుకు అర్బన్ యాప్ సాయంతో చర్యలు ప్రారంభించారు.
నీటమునిగిన వాహనాలకు బీమా క్లెయిమ్స్ త్వరగా సెటిల్ చేయాలంటూ సదరు కంపెనీల్ని పిలిపించి ఒప్పించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను పిలిపించి విజయవాడకు జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టిలో పెట్టారు. 6,880 కోట్ల మేర నష్టం జరిగిందంటూ సాయం కోసం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపారు.
వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి కుదుటపడిందని, సహాయ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని నిర్ధారించుకున్నాకే ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు సీఎం చంద్రబాబు. అప్పటిదాకా పండగైనా, పబ్బమైనా ప్రజలతోనే.!చివరకు వినాయకచవితినీ ప్రజల మధ్యే జరుపుకున్నారు. పది రోజుల తర్వాత ఇల్లు చేరారు.