CM Chandrababu Teleconference on AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, ఆయా జిల్లాల్లో పరిస్థితులు, నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను కలెక్టర్లు చంద్రబాబుకు వివరించారు. జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. నేడు, రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోందన్నారు.
ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలి: ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. భారీ, అతిభారీ వర్షాలు ఉండే ప్రాంతంలో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంప్‌లకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలన్నారు. పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించాలన్నారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించడం సహా, వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీంను సంప్రదించాలన్నారు. ఏజెన్సీలో భారీ వర్షాలు, వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే, ఒక జిల్లా నుంచి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపించాలని తెలిపారు. వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాద బారిన పడకుండా ఆంక్షలు విధించాలని ఆదేశించారు. వినాయకుని నిమజ్జనానికి కూడా వెళ్లి ప్రమాదం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తక్షణం నిధులు విడుదల: 2 వేల మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం అందిస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వివరించారు. విజయనగరం జిల్లాలో నిన్న, నేడు భారీ వర్షాలున్నాయని, దానికి అనుగుణంగా రాకపోకలను బ్రిడ్జిలపై నియంత్రిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
బాపట్ల జిల్లాలో పునరావాస కేంద్రాల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 8 రోజులుగా విజయవాడలో వరద పరిస్థితులు, ప్రజల కష్టాలను, సహాయ చర్యలకు తగ్గట్లుగా అందరూ సిద్ధం చేసుకోవాలన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా స్థాయిలో తీసుకునే చర్యలకు అప్పటికప్పుడే నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి మరో వాయు"గండం" - ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి- ఉప్పొంగుతున్న వాగులు - RAINS Alert
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు: వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా పలువురు విరాళం అందిస్తున్నారు. వరద బాధితులకు ఏపీ పోలీస్ అధికారుల సంఘం రూ.11.12 కోట్ల విరాళం ఇచ్చింది. వరద సహాయక చర్యల కోసం దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ సంస్థ రూ.కోటి విరాళం ఇచ్చింది. ఈ మేరకు దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ సంస్థ సంస్థ ఎండీ ఏవీ సుబ్రహ్మణ్యం, ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు చెక్ అందచేశారు. అదే విధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి గ్రామీణ నీటి సరఫరా కాంట్రాక్టర్ల అసోసియేషన్ 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చింది. అసోసియేషన్ ప్రతినిధులు బొమ్మినేని రామాంజనేయులు, వెలగపూడి రామారావు, వెలగపూడి శ్రీనివాస్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి 50లక్షల రూపాయల చెక్‌ను అందచేశారు. వీరితో పాటు మరికొంతమంది సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చారు.