CM Chandrababu Speech at Gram Sabha in Puchakayalamada: ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను 4 వేల రూపాయలకు పెంచి ఇస్తున్న ప్రభుత్వం తమదని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో పర్యటించిన సీఎం ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. ఆ తరువాత పుచ్చకాయలమడలో రూ.2.83 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం పుచ్చకాయలమడలో ప్రజావేదికలో పాల్గొన్న మాట్లాడిన చంద్రబాబు పింఛన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారని స్పష్టం చేశారు.
జగన్ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారు: గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు, చెట్లు కొట్టేసేవారు సీఎం చంద్రబాబు విమర్శించారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేదని అన్నారు. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావని ఇప్పుడు ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పింఛన్లు ఇస్తున్నామని వివరించారు. జగన్ వెళ్తూ వెళ్తూ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్లారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. హంద్రీనీవా నీటిని అన్ని చెరువులకు ఇవ్వాలని భావించామని కానీ గత ఐదేళ్లలో ఒక్క ఎకరాకు నీరివ్వలేదని సీఎం ఆరోపించారు. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నామని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ప్రతిచోటా భూ సమస్యలు సృష్టించారని ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో సగం భూసమస్యలే ఉన్నాయని అన్నారు.
రూ.100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం: రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతే కాకుండా వర్క్ ఫ్రమ్ హోం విధానం కూడా తీసుకువస్తున్నామని వివరించారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమల యజమానులతో మాట్లాడుతున్నామని వారిని తిరిగి ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. మీకు దగ్గరలో ఉన్న ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభించామని రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీరివ్వాలనేది తమ లక్ష్యమని సీఎం తెలిపారు.
ఓర్వకల్లులో పరిశ్రమలు, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తామని చంద్రబాబు అన్నారు. మెరుగైన మద్యం పాలసీ తీసుకువచ్చామని అంతే కాకుండా రూ.100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం కూడా చేపడతామని అన్నారు. భర్తలకు ఉన్న మద్యం అలవాటును మాన్పించే బాధ్యత మహిళలదేనని అన్నారు.
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఇంటింటికీ తాగునీరు ఇస్తోందని, కేంద్రం సాయంతో ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ కరెంట్, కుళాయి, సిలిండర్, టాయిలెట్ ఉండాలన్నారు. ఇళ్లు లేనివారికి సొంతిల్లు కట్టి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 64.5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అనర్హులు కూడా పింఛన్లు అడగడం సరికాదని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు స్థానికంగానే ఉపాధి దొరికేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రం మనదే కావాలి: 2047 నాటికి మనదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని అప్పటికి దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రం మనదే కావాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశానని అంతే కాకుండా యవతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. మద్యం విధానంలో శెట్టిబలిజ, ఈడిగ, గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు.