CM Chandrababu on Encroachments: విజయవాడ నగరంలో ఇప్పటికీ 0.5 టీఎంసీ నీరుందని, వర్షం లేకపోతే, సోమవారం సాయంత్రానికి ఆ నీరు కూడా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ బృందాన్ని జవాబుదారీతనంగా పెట్టి పారిశుద్ధ్యం, ఆహారం పంపిణీ చేపట్టామని వెల్లడించారు. గత 8 రోజుల్లో 97 లక్షల మందికి పైగా సరిపడా ఆహారం పంపిణీ చేశామని చెప్పారు.
బుడమేరు ఇన్ ఫ్లో, నగరంలో పడే వర్షపాతం, తదితర అధ్యయనాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలన్నారు. దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు బాగు చేపించటం ఇప్పుడు పెద్ద సవాల్ అని తెలిపారు. పాడైన వాహనాలకు బీమా సౌకర్యం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాడైన ఆటోలు, కార్లు, బైకులు బాగుచేయిస్తామన్న సీఎం, గృహోపకరణాలకు మరమ్మతు చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
వరద బాధితులకు ఇవాళ కూడా ఆహారం, తాగునీరు అందించామన్నారు. వరద ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేశామని, 260 ట్యాంకర్లు తిరుగుతున్నాయని వెల్లడించారు. 1,200 వాహనాల ద్వారా రేషన్ సరకులు సరఫరా చేస్తున్నామని, వరద ప్రాంతాల్లో 7 వేల 100 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. రోడ్లపై ఇసుక, మట్టి లేకుండా శుభ్రం చేస్తున్నామన్న సీఎం, వరద ప్రాంతాల్లో 122 బోట్లు, 37 డ్రోన్లు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
వరద మరింత పెరిగే అవకాశం- కలెక్టర్లతో సీఎం చంద్రబాబు - CM Chandrababu on AP Rains
ఆపరేషన్ బుడమేరు: కొల్లేరులో ఆక్రమణలు వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని, దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ అండతో కొందరు విచ్చలవిడిగా చేశారని మండిపడ్డారు. ప్రజా భద్రత కంటే ఈ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తున్నామన్నారు. విజయవాడలో మరోసారి ఇలాంటి వరదలు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుడమేరు ఆపరేషన్ చేపడతామని, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. గత 5 ఏళ్లలో డ్రైన్ లన్నీ నాశనం చేశారని, అన్నీ కూడా ఆధునికీకరిస్తామని తెలిపారు.
వరద రావటానికి కారణాలు, ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు గవర్నర్కు నివేదించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందనే ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉద్ధృతిని నిశితంగా పరిశీలిస్తూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ, అల్లూరి జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించి ముందస్తు హెచ్చరికలు పంపామని తెలిపారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra