CM Chandrababu Announced Special Package for Flood Victims: గత పాలకుల నిర్లక్ష్యం, అక్రమాలు శాపంగా మారాయని, బుడమేరు పనులు పూర్తి చేసి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సీఎం మాట్లాడారు. వంద రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. బుడమేరు పూర్తిగా దురాక్రమణ, కబ్జాలు చేశారని మండిపడ్డారు.
మూడు బోట్లు వదిలిపెడితే కౌంటర్ వెయిట్‌ను ఢీకొట్టాయని, 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సమయంలో బోట్లు వదిలారని తెలిపారు. సాధారణ స్థితికి రావడానికి పది రోజులు పట్టిందని, గత ప్రభుత్వం ఉండి ఉంటే ఆరు నెలలైనా సరిపోయేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు యూసీలు ఇవ్వలేదన్నారు. పోలవరానికి ఇచ్చిన కేంద్ర నిధులను మళ్లించారన్న సీఎం, పంచాయతీరాజ్ విభాగంలో రూ.990 కోట్లు మళ్లించారని, ధాన్యం ఇచ్చిన రైతులకు రూ.1650 కోట్లు బకాయిలు పెట్టారని తెలిపారు.
రూ.10.5 లక్షల కోట్లు అప్పు, రూ.లక్ష కోట్ల బిల్లు చెల్లించాలని పేర్కొన్నారు. ఖర్చు పెట్టిన డబ్బులను ఖాతాలో చూపలేదన్న సీఎం, వరదల బాధితుల సాయానికి భారీ స్పందన వచ్చిందని అన్నారు. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీని సీఎం ప్రకటించారు.
వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజ్: బుడమేరు ముంపులో మునిగిన విజయవాడ నివాసితులకు ముందెన్నడూ లేని విధంగా పరిహారం ప్రకటించింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకూ మునిగిన ప్రతీ ఇంటికి 25 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మొదటి అంతస్తులోని బాధితులకు రూ. 10 వేలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన బాధితులకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని వెల్లడించారు.
చిరు వ్యాపారులకు భరోసా: చిరు వ్యాపారులకు రూ.25 వేలు ఆర్థికసాయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. 40 లక్షల నుంచి కోటిన్నర టర్నోవర్ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు లక్ష, కోటిన్నర టర్నోవర్ దాటిన ఎంఎస్‌ఎంఈలకు లక్షన్నర పరిహారం అందిస్తామని చెప్పారు. వరదల్లో మునిగిన బైకులకు 3 వేలు, త్రిచక్రవాహనాలకు 10 వేలు పరిహారం ప్రకటించారు. ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేస్తామన్నారు.
నేతన్నకు ఆర్థికసాయం: చేనేత కార్మికులకు రూ.15 వేలు ఆర్థికసాయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు 25 వేల సాయం అందిస్తామని చెప్పారు. ఫిషింగ్ బోట్లకు నెట్ దెబ్బతిని పాక్షిక ధ్వంసమైతే రూ.9 వేలు, పూర్తిగా ధ్వంసమైతే రూ.20 వేలు ఇస్తామని వెల్లడించారు. నెట్ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైన మోటార్ బోట్లకు రూ.25 వేలు ప్రకటించారు. హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.
పంట నష్టాలకు పరిహారం: హెక్టార్ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు ప్రకటించారు. అదే విధంగా హెక్టార్ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, హెక్టార్ చెరకుకు రూ.25 వేలు, హెక్టార్ పొగాకుకు రూ.15 వేలు, హెక్టార్ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు, హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడుకు రూ.15 వేలు, జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు అందిస్తామని వెల్లడించారు.
పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున, కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు, బొప్పాయికి రూ.25 వేలు, టమాటకు రూ.25 వేలు, జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు, ఉల్లిపాయ రూ.25 వేలు, నిమ్మకు రూ.35 వేలు, మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు, పుచ్చకాయకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు, దానిమ్మకు రూ.35 వేలు, సపోటకు రూ.35 వేలు అందిస్తామన్నారు. డ్రాగన్ ఫూట్‌కు రూ.35 వేలు, పామాయిల్ చెట్టుకు రూ.1500, సెరీకల్చర్‌కు రూ.25 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500 సాయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పశువులకు సాయం ప్రకటన: పశువులకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు సాయం అందిస్తామన్నారు. దూడలకు రూ.25 వేలు, గొర్రెలకు రూ.7500 సాయాన్ని ప్రకటించారు. కోళ్లకు రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5 వేలు సాయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
నీరు-చెట్టు పెండింగ్ నిధులు - విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశం