Chandrababu Instructions to MPs : కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు సమన్వయంతో పనిచేయాలని టీడీపీపీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.100 కోట్లు కూడా ఎంతో ముఖ్యమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలేమున్నాయి? ఎక్కడి నుంచి ఎంత నిధులు తెచ్చుకోగలమన్న విషయంలో మంత్రులంతా వారి శాఖలవారీగా కసరత్తు చేసి, ఎంపీలకు చెప్పాలని సీఎం ఆదేశించారు.
బీజేపీ, జనసేన సహా రాష్ట్ర ఎంపీలందరికీ ఒక్కొక్కరికీ రెండు మూడు చొప్పున కేంద్ర ప్రభుత్వ శాఖల్ని చంద్రబాబు కేటాయించారు. వారికిచ్చిన శాఖల్ని బట్టి మంత్రుల్ని వారికి జతచేశారు. వారు ఆయా శాఖల వారీగా కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఎంపీలు తరచూ ఆ శాఖలకు వెళ్లి ఫాలోఅప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల్లో ఏయే నిధులున్నాయి? ఏ పథకాలున్నాయి? ఇతర రాష్ట్రాలకు కేటాయించి, వారు వాడుకోని నిధులేమైనా మిగిలాయా? అన్న వివరాల్ని తెలుసుకుంటూ, వాటిని ఏపీకి తెచ్చుకోవడం, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు అదనపు నిధులు రాబట్టుకోవడంపై కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.
CBN on TDP Parliamentary Meeting : గతంలో ముఖ్యమంత్రిగా అలాంటి కసరత్తంతా తానే చేసేవాడినని, ఇప్పుడు ఎంపీలు, మంత్రులకు ఆ బాధ్యత అప్పగిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు? ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో ఎలాంటి చొరవ చూపారన్న అంశాల ప్రాతిపదికన ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎంపీల పనితీరుని సమీక్షిస్తానని ఆయన పేర్కొన్నారు.
"కేంద్ర మంత్రులకు చంద్రబాబు ఓ లిస్ట్ ఇచ్చారు. రాష్ట్రానికి ఈ నిధులు కావాలని అడిగారు. కేంద్రమంత్రులు కూడా చంద్రబాబుకు ఓ లిస్ట్ ఇచ్చారు. ఐదేళ్లు రాష్ట్రంలో ఎన్నో అవకవతవకలు జరిగాయని చెప్పారు. కేంద్రానికి రాష్ట్రం నష్టపోయిందని తెలుసు. అందుకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ఏపీని గాడిలో పెడతాం." - కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సముచిత కేటాయింపులు : విశాఖ ఉక్కు కర్మాగారంపై తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలన్న చంద్రబాబు దాన్ని పూర్తిస్తాయిలో గాడిన పెట్టేందుకు కృషి చేస్తామన్నారు. కడప ఉక్కు కర్మాగారంపైనా కేంద్రంతో చర్చలు జరపాలని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు, జల్‌జీవన్‌మిషన్ వంటి పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టాలని వివరించారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సముచిత కేటాయింపులు ఉంటాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు.
విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేలా ఎంపీలు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించామని, ఎంపీలు కూడా తగిన చొరవ తీసుకోవాలని తెలిపారు. గతంలో మంజూరైన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని, అవసరమైన నిధులు తెచ్చి కార్యకలాపాలు ప్రారంభించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవాలి : ప్రకాశం జిల్లా సహా రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వెనుకబడిన జిల్లాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 90 శాతం కేంద్ర సబ్సిడీని సాధించాలని ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక రాయితీలూ సాధించాలని దిశానిర్దేశం చేశారు. భూసేకరణ సమస్యను పరిష్కరించి నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ పనులు వేగవంతం చేయాలని వివరించారు.
కోటిపల్లి-నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకి భూసేకరణ అంశాన్ని కేంద్రంతో మాట్లాడి ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. జాతీయ రహదారులపైనా దృష్టి పెట్టాలని చెప్పారు. అమరావతి-అనంతపురం, రాజధాని ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి తేవాలని తెలిపారు. గిరిజన యూనివర్సిటీ కొత్త వలసలోనే ఏర్పాటవుతుందని, ఎప్పుడో పూర్తి కావాల్సిన ఆ ప్రాజెక్టుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డుని నాలుగేళ్లలో పూర్తి చేసుకోవాలన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డుకి గ్రీన్‌ఫీల్డ్ రహదారికి కేంద్రం సుముఖత వ్యక్తంచేసిందని, నిధులు మంజూరవుతాయని చంద్రబాబు వెల్లడించారు.
విశాఖను సింగపూర్ చేద్దాం - యువతకు అవకాశాలు కల్పిద్దాం: చంద్రబాబు - CII National Council meeting