Pensioners Happy in AP : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదల ఇళ్లలో సందడి. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల మోములో అనందం. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. పింఛన్ పంపిణీ సందర్భంగా ఏపీ అంతటా గురువారం కనిపించిన దృశ్యాలివి. ఒక్క రోజులోనే 64 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి రూ.2737 కోట్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది కూటమి ప్రభుత్వం. కాగా, ఇదే రోజున ఉద్యోగులకు సైతం వేతనాలు జమ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇదిలా ఉండగా ఫస్ట్ తారీఖునే పింఛన్ల పంపిణీతో పాటు ఉద్యోగులకు వేతనాలు అందజేయడం తనకు సంతృప్తినిచ్చిందని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఫస్ట్ తారీఖునే పింఛన్ అందుకోవడంపై లబ్ధిదారుల ఆనందోత్సాహం అంతా ఇంతా కాదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛను అందించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆర్థిక పరిస్థితిపైనా ఆరా తీసిన చంద్రబాబు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై ఓ పింఛన్ లబ్ధిదారుడు వ్యాఖ్యలు వైరల్గా మారాయి. రాయలసీమ యాసలో అతడి మాటలు ఆసక్తిగొలిపాయి.
నాకు మొదటసారి పెన్షన్ ఇచ్చినోడివి నువ్వే..
— Telugu Desam Party (@JaiTDP) August 1, 2024
తరువాత రూ.1000 పెన్షన్ ఇచ్చినోడివి నువ్వే..
తరువాత రూ.2000 పెన్షన్ ఇచ్చినోడివి నువ్వే ..
మొన్న పండుగగా రూ.7000 పెన్షన్ ఇచ్చినోడివి నువ్వే ..
ఇప్పుడు రూ.4000 పెన్షన్ ఇచ్చినోడివి నువ్వే ..
నాకు ఇల్లు ఇచ్చినోడివి కూడా నువ్వే..… pic.twitter.com/onCUF41s3U
ఈ నాలుగు వేల రూపాయల (పింఛన్) వల్ల నీకు లాభమేంటి? అని చంద్రబాబు ప్రశ్నించగా
"లాభమే సార్.. నా ఖర్చుల కోసం నేను వాడుకుంటూ, నా సంసారం నేను చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్నాం" అని సమాధానమిచ్చాడు.
'నీకు తెలుసా ఎప్పుడొచ్చింది ఈ పింఛన్' అని చంద్రబాబు అడగారు. దీనిపై లబ్ధిదారుడి స్పందన ఇదీ..
"సార్.. ఫస్ట్ ఇన్నూరు (200) రూపాయల పింఛన్ ఇచ్చింది నువ్వే.. అందమైన ఒక ఇల్లు ఇచ్చింది నువ్వే.. వెయ్యి రూపాయలు ఇచ్చినోడివి నువ్వే.. తిరగ (తరువాత) 2వేలు ఇచ్చిన మహానుభావుడివి నువ్వే.. మొన్న పండుగగా దయానందుడిగా రూ.7 వేలు పెన్షన్ ఇచ్చినోడివి నువ్వే.. ఇప్పుడు మనస్ఫూర్తిగా రూ.4000 పెన్షన్ ఇచ్చినోడివి నువ్వే.."
పింఛన్ లబ్ధిదారుడు తన ఆనందాన్ని సభాముఖంగా పంచుకోవడంతో గ్రామస్తులంతా చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఫస్ట్ తారీఖునే వేతనాలు తమ ఖాతాల్లో జమ కావడంపై ఉద్యోగులు సైతం ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఓ ఉద్యోగి ఫస్ట్ తారీఖునే వేతనాలు పడ్డాయంటూ తన ఆనందాన్ని పలకపై రాసి పెట్టిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
పండగలా పింఛన్ల పంపిణీ - మొదటి రోజే అందరికీ అందించేలా చర్యలు - Pension Distribution in AP