Chandrababu on Election Schedule in Andhra Pradesh: ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో, వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉందన్న ఆయన, మే 13 చారిత్రక రోజని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైకోను ఇంటికి పంపుతున్నామని ధీమా వ్యక్తంచేశారు. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవ్వరికీ భయం లేదని, ఇప్పుడు అందరూ బయటకొస్తారని తెలిపారు. ఫించన్లు కట్ అవుతాయని, కేసులు పెడతారనే భయం ఇక అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదంగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రానుందని తెలిపారు. ఎన్డీఏకు 400కి పైగా సీట్లు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారని చంద్రబాబు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికల సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై సదస్సులో చర్చించారు. సదస్సులో జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు, తెలుగుదేశం లీగల్ సెల్ నేతలు పాల్గొన్నారు.
"ఆలిండియా లెవల్లో సర్వేలన్నీ చూస్తున్నారు. కేంద్రంలో, ఏపీలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే. ఇందులో ఏ మాత్రం అనుమానం అవసరం లేదు. ఈ రోజే ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం వరకూ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరో ఎత్తు. స్వాంతంత్ర్యం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు ఉన్మాదుల రాజ్యం నుంచి స్వాంతంత్ర్యం వచ్చిందని ప్రజలంతా పండగ చేసుకునే పరిస్థితికి వచ్చారు. రేపటి నుంచి ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఎన్డీఏ కూటమికి సహకరిస్తారు". - చంద్రబాబు, టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్లోమే 13న పోలింగ్- జూన్ 4న ఫలితాలు
ఏపీలో కూడా కనివినీ ఎరుగని రీతిలో ఎన్డీఏ కూటమి సీట్లు దక్కించుకోబోతోందని చంద్రబాబు వెల్లడించారు. దేశం ముందుకెళ్తోంటే, ఏపీని మాత్రం ఈ దుర్మార్గుడు వెనక్కు తీసుకెళ్లాడని ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఏపీని ఉన్మాది పాలన నుంచి విముక్తి చేసేలా పోరాడాలని సూచించారు. సాంకేతికాంశాలతో నామినేషన్ల నుంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని ఆరోపించారు. తన మీద ఎన్ని కేసులున్నాయో చెప్పాలని డీజీపీని కోరానన్న చంద్రబాబు, దొంగ కేసులు పెట్టి నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు.
తనతో పాటు చాలా మంది అడ్వకేట్లూ నిద్ర లేని రాత్రులు గడిపారన్నారు. లాయర్లకు 7 వేల స్టైఫండ్ ఇస్తామని, అడ్వకేట్ల సంక్షేమం కోసం 100 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెడికల్ క్లైములు 5 లక్షలు, జీవిత భీమా కోసం 15 లక్షలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ భీమాకు ప్రిమీయం రాబోయే ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
దేశంలో మోగిన ఎన్నికల నగారా- 7విడతల్లో సార్వత్రిక పోరు- పోలింగ్, కౌంటింగ్ తేదీలివే