TDP Chief Chandrababu Tour in Kuppam : కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన మొదటి రోజు బిజీబిజీగా సాగింది. ఒకేరోజు నాలుగు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కొత్తపేట కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొన్న బాబు, వైసీపీ అరాచకాలను ఎండగట్టారు. చివరగా బాబూనగర్‌లోని ముస్లింలతో ఇఫ్తార్ విందులో హాజరైన చంద్రబాబు టీడీపీ హయాంలో ముస్లింల అభ్యున్నతికి తోడ్పడిన పథకాలపై ప్రసగించారు.
మహిళలతో ముఖాముఖీ: . మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించిన పార్టీ, ఆస్తి హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశమేనని ఈ పార్టీ అధినేత వ్యాఖ్యానించారు. కుప్పం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో దేశం గర్వించేలా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని, ఇంటికే 4 వేల రూపాయల పింఛన్ అందజేస్తామని తెలిపారు. డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్కులు రావడానికే భయపడ్డారని కానీ ఇప్పుడు చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
ఈ సారి టీడీపీకి అత్యధిక మెజారిటీ వచ్చేది కుప్పంలోనేనని ధీమా వ్యక్తం చేశారు. పింఛన్లు ఆపేస్తామని ఎవరు బెదిరించినా పట్టించుకోవద్దని మహిళలకు సూచించారు. కుప్పం, ఇక్కడి ప్రజలను జీవితంలో మరిచిపోలేని నేను ప్రచారానికి రాకపోయినా ఇక్కడి ప్రజలు ఆదరించారని చంద్రబాబు అన్నారు. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు వారికి ఆర్థిక స్వాతంత్య్రం ఇవ్వాలని ఆలోచించినట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తెచ్చామని అన్నారు. డ్వాక్రా సంఘాల్లో లక్షల మంది ఉన్నారంటే అది కేవలం టీడీపీ చొరవేనని తెలిపారు.
ఎంపీ కృష్ణదేవరాయలు పేరిట వైఎస్సార్సీపీ ట్వీట్- ఈసీకి ఫిర్యాదు - TDP Leaders on Visakha drug case
వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచుతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జే బ్రాండ్ ఎందుకు తెచ్చారో అడిగితే చెప్పకుండా దాడి చేస్తారని మండి పడ్డారు. డ్వాక్రా సంఘాల్లో లక్షలమంది మహిళలు ఉన్నారంటే అది టీడీపీ చొరవేనని అన్నారు. మహిళలను పైకి తెచ్చేందుకు ఇంటికి రెండు ఆవులు ఇస్తామంటే ఎగతాళి చేశారు కానీ ఇప్పుడు పాడి పరిశ్రమతో కుప్పం అర్థిక స్థితిగతులు మారాయని అన్నారు. ఏపీ మహిళలు ఇతర దేశాల మహిళలకు ఆదర్శం కావాలని సూచించారు. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకోవడమే ఈ జలగ పని అని చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకులు కుప్పంలో రాళ్లు, మట్టి దోచేశారని ఇసుక మింగేశారని ఆరోపించారు.
కుప్పం అభివృద్ధి సంగతి నాకు వదిలేయండి నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. 2 కోట్లమందికి హామీ ఇస్తున్నా మహిళల ఆదాయం రెట్టింపు చేస్తానని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించి ఆదాయం పెంచుతా దాన్ని మహిళలకే పంచుతానని అన్నారు. రైతులకు రాయితీపై డ్రిప్ పరికరాలు ఇచ్చామని అన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టామని మహిళలను ఆర్టీసీ కండక్టర్లుగా కూడా నియమించాం గుర్తు చేసారు. నేడు సామాన్య ప్రజలు ఏదీ కొనే పరిస్థితి లేకుండా ధరలన్నీ పెంచేశారని అన్నారు. రాష్ట్రంలోని మహిళలంతా తెలుగుదేశం పక్షమేనని రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఇంకో 40 రోజులు కష్టపడాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఇంటికే 4 వేల రూపాయల పింఛన్ అందజేస్తామని చంద్రబాబు అన్నారు
ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి: పవన్ - Pawan Kalyan on Veera Mahilalu
పర్యటనలో భద్రతా వైఫల్యం : చంద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న బాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు బస చేసే వాహనాన్ని జనాలు చుట్టుముట్టగా.. అదుపు చేయటానికి పోలీసులు లేకపోవడంతో శ్రేణుల్లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
బహిరంగ సభలో : అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ రౌడీయిజం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పం బస్టాండ్ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై నిప్పులు చెరిగారు. హంద్రీనీవా నీళ్ల పేరుతో జగన్ కుప్పం వచ్చి హంగామా చేశారు తప్ప నీళ్లు రాలేదని ఎద్దేవా చేశారు. వచ్చే సీజన్‌లో కుప్పంకు నీళ్లు తెచ్చి అన్ని చెరువులు నింపుతామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రేణుల్లో జోష్ నింపారు.
ఇఫ్తార్ విందులో చంద్రబాబు : ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశమేనని ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించింది కూడా తామేనని చంద్రబాబు అన్నారు. పర్యటనలో భాగంగా బాబూనగర్‌లోని ముస్లింలతో ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇచ్చింది కూడా తామేనని గుర్తుచేశారు. వైసీపీ పాలనలో అనేక మంది ముస్లింలు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు.