Excitement on TDP Pending Seats : ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలకు టీడీపీ మొదటి జాబితాలోనే 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మచిలీపట్నం, పామర్రు, పెడన, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిత్రపక్షాలకు అవనిగడ్డ, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలు కేటాయింపు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మైలవరం నియోజకవర్గానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయన వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి 2019లో దేవినేని ఉమాపై విజయం సాధించారు.
చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూ - రాజకీయ భవిష్యత్తుకు హామీ
2019 నుంచి దేవినేనికి, వసంత కృష్ణప్రసాద్ కు మధ్య ఉప్పు నిప్పులా సాగింది. పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఆయన టీడీపీలో చేరడం దేవినేనికి ఇష్టం లేకున్నా పార్టీ నిర్ణయం శిరోధార్యం అంటూ దేవినేని సర్దుకున్నారు. మైలవరం (mylavaram) నుంచి ఇద్దరిలో ఎవరిని పోటీలోకి దించాలనే దానిపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఐవీఆర్ఎస్ ద్వారా కార్యకర్తల అభిప్రాయం సేకరించింది. వీరిలో ఒకరికి మైలవరం టిక్కెట్ కేటాయిస్తే మరొకరికి పెనమలూరు ఇస్తారనేది ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. రేపో, మాపో టీడీపీ ప్రకటించే మూడో విడత జాబితాతో ఈ సందేహాలన్నీ తీరిపోతాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజకీయాలు పెనమలూరుతో ముడిపడి ఉన్నాయి. మైలవరం నుంచి కృష్ణప్రసాద్, దేవినేనిలో ఒకరు పోటీ చేస్తే మరొకరిని పెనమలూరుకు పంపుతారనే ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది.
టీడీపీ రెండో జాబితా విడుదల చేసిన చంద్రబాబు- 34మందికి చోటు
పెనమలూరులో 2014లో గెలుపొందిన బోడే ప్రసాద్ 2019లో కొలుసు పార్థసారధి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం పార్థసారధి వైకాపా నుంచి టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీకి దిగుతున్నారు. బలంగా మారిన పెనమలూరు సమీకరణాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ మంత్రి జోగి రమేశ్ ను రంగంలోకి దించింది. ఇలాంటి పరిస్థితిలో ఆర్థిక వనరులు ఉండే బలమైన అభ్యర్థి కావాలని టీడీపీ (TDP) భావిస్తోంది. ఈసారి టికెట్ కేటాయించడం కొంత కష్టంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బోడేకు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో అలజడి రేగింది. పెనమలూరులో దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్, ఎంఎస్ బేగ్ పేరుతో టీడీపీ ఇప్పటికే ఐవీఆర్ఎస్ నిర్వహించడంతో కార్యకర్తలకు కొంత అవగాహన వచ్చింది. ప్రస్తుతం దేవినేని పెనమలూరుకు వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాను సైతం పోటీ చేస్తానంటూ బోడే ప్రకటించడంతో టీడీపీ సీనియర్ నాయకులు ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డారు.
అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట - ఆశీర్వదించి గెలిపించాలి: చంద్రబాబు
పొత్తులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఒక స్థానం బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అక్కడి నుంచి బండ్రెడ్డి రామకృష్ణ, మరికొంత మంది ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం (Vijayawada West Constituency) కూడా జనసేనకు కేటాయించగా బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత సమీకరణాలు మారిపోయాయి. దీన్ని బీజేపీకి కేటాయించారని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఖరారు కానప్పటికీ 2014లోనే ఇదే స్థానం బీజేపీకి కేటాయించగా వెలంపల్లి శ్రీనివాస్ (Velampally Srinivas) పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యే స్థానం బీజేపికి కేటాయించారని, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేరు కూడా విన్పిస్తోంది.
అపోహలు నమ్మొద్దు - చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కళా వెంకట్రావు
మరోవైపు జనసేన నుంచి టికెట్ ఆశించిన పోతిన మహేశ్ ఇప్పుడు టికెట్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆయన తరఫున కార్యకర్తలు తమ గళాన్ని అధిష్ఠానానికి వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ పశ్చిమలో టీడీపీ తరపున జలీల్ ఖాన్, మిగతా ఆశావహుల్ని పార్టీ పెద్దలు సర్దిచెప్పి ఒప్పించారు. ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టికెట్ పోటీ ప్రధానంగా బీజేపీ, జనసేన అభ్యర్థుల (BJP JanaSena candidates) మధ్యే కేంద్రీకృతమైంది. ఎవరి అంచనాలు, ఎవరి ఎత్తుగడల్లో వారుండగా ఆయా పార్టీలు ప్రకటించే అభ్యర్థుల ప్రకటనలపై అందరూ దృష్టి కేంద్రీకరించారు. మరి ఎవరికి టికెట్ దక్కుతుందో, ఎవరికి రిక్తహస్తం మిగులుతుందో త్వరలోనే తేలిపోనుంది.