AP cabinet meeting : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పోలవరం ప్రాజెక్టులోని డయాఫ్రం వాల్ నిర్మాణంపై కేబినెట్లో చర్చించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం నీతి ఆయోగ్‌లో ఏపీ ప్రతిపాదించనుంది. ఢిల్లీలో ఈ నెల 27 తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రతిపాదనలు సీఎం పెట్టనున్నారు. నీతి ఆయోగ్‌లో ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తప్పనిసరి కావటంతో ప్రస్తుతం దానిపై అత్యవసర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వటంపైనా కేంద్రాన్ని అభినందిస్తూ కేబినెట్లో తీర్మానం పెట్టే అవకాశం ఉంది.
ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ఆర్థిక సాయంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పలు అంశాలను వెల్లడించింది. ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు గ్యారెంటీలకు భరోసా ఇచ్చింది. మున్ముందు మరింత సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఇదిలా ఉండగా త్వరలో నీతి అయోగ్ సమావేశ కానున్న నేపథ్యంలో మరిన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందుంచాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రథమ ప్రాధాన్య అంశంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. తన తొలి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన ఆయన గడిచిన ఐదేళ్లలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నాణ్యతపై ఆరా తీశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను తిరిగి ఎక్కడినుంచి ప్రారంభించాలన్న అంశమై అధికారులు, కాంట్రాక్టు సంస్థ బాధ్యులతో చర్చించారు. చివరికి నాణ్యత పరిశీలనకు అంతర్జాతీయ నిపుణులను రప్పించారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతను భుజానికెత్తుకున్న కేంద్రం... డయాఫ్రం వాల్ పునర్నిర్మాణానికి సిద్ధమైంది. ఈ విషయంపై చర్చించి కొత్త ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27 దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశం ముందుంచనున్నారు.