Assembly Approves Repeal Land Titling Act 2022 : రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో తెచ్చిన ఈ చట్టంపై అనేక ఆందోళనలు, అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమయ్యాయిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టం రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. ఆ మేరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే చట్టం రద్దుపై సంతకం చేశారు. అలాగే మొదటి మంత్రి వర్గం సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గం ఆమోదం అనంతరం ఆ బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. భూహక్కు చట్టాన్ని రద్దు చేసే బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సభలో ప్రవేశ పెట్టగా సభ్యులంతా ఆమోదం తెలిపారు.
విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెడుతూ ప్రవేశ పెట్టిన బిల్లును కూడా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వైఎస్సార్సీపీ హయాంలో యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఆ మేరకు బిల్లును ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చాలన్న నిర్ణయానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వైఎస్సార్సీపీ సభ్యులు ఎవరూ సభకు హాజరు కాకపోవడంతో ఇవాళ ప్రవేశ పెట్టిన రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
తెలుగులో బిల్లుల ప్రకటన : అసెంబ్లీలో సభాపతి అయ్యన్నపాత్రుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళవారంనాటి శాసనసభ సమావేశంలో అచ్చతెలుగులో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించే సమయంలో సభాపతి సాధారణంగా ఆంగ్ల పదాలు ఉపయోగిస్తారు. అప్పుడు కూడా అయ్యన్నపాత్రుడు అచ్చంగా తెలుగులోనే మాట్లాడారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు ‘అవును’ అనాలని సభ్యులను కోరారు. దీంతో సభ్యులంతా అవును అంటూ సమ్మతి తెలిపారు. చివరగా సభ వాయిదా వేయడమైనదంటూ తెలుగులోనే ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సభాపతిని ప్రశంసించారు. మాతృభాషకు ఆయన ఇచ్చే గౌరవాన్ని కొనియాడారు.
'హూ కిల్డ్ బాబాయ్'కి త్వరలోనే సమాధానం వస్తుంది: చంద్రబాబు - Who Killed Babai