Arrangements for Counting of Votes: జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం అధికారులంతా సిద్ధమవుతున్నారు. లెక్కింపు దృష్ట్యా పలుచోట్ల విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి కౌంటింగ్ శిక్షణ అందిస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూడాలని పోలీసులు రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈసీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ పకడ్బందీగా ప్రక్రియను పూర్తిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులకు ఒంగోలు కలెక్టరేట్లో రిటర్నింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆమంచి అనుచిత వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు - విచారణ జరపాలని ఆదేశం - EC inquiry on Amanchi Krishnamohan
కర్నూలులో ఎన్నికల సిబ్బందికి కౌంటింగ్‌కు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన ఆధ్వర్యంలో సూపర్‌వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్‌కు కౌంటింగ్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో పాటు పాణ్యం రిటర్నింగ్ అధికారి కూడా పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా రావికమతంలో ఎస్పీ మురళీకృష్ణ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో, ఆ తర్వాత గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు జరగకుండా చూడాలని నేతలకు సూచించారు. లెక్కింపు తర్వాత గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తున్న వేళ విజయవాడ శివారు జక్కంపూడి జేఎన్ఎన్యూఆర్ఎమ్ కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నార్త్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పర్యవేక్షణలో సుమారు వందమంది పోలీసులు ఎనిమిది బృందాలుగా విడిపోయి కాలనీలోని ఐదు బ్లాకులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని ఏసీపీ తెలిపారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఆందోళనలు జరిగితే ఏవిధంగా అదుపు చేయాలో పోలీసులు కళ్లకు కట్టేలా ప్రదర్శించారు.