Sharmila Fires on YS JAGAN And CBN: రాష్ట్రంలో వరద విలయానికి గత ప్రభుత్వమే కారణమంటున్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం శివారులో ఏలేరు కాలువను, నీట మునిగిన పంట పొలాలను వైఎస్ షర్మిల పరిశీలించారు. షర్మిలతో రైతులు మాట్లాడుతూ, ఏలేరు పూడిక తీయకపోవడం వలన తీవ్రంగా నష్టపోయామని, నష్ట పరిహారాన్ని రైతులను కాకుండా కౌలు రైతులకు ఇప్పించేలా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఎకరాకు 10 వేలు కాకుండా, 25 వేల రూపాయల పరిహారాన్ని తక్షణం ఇవ్వాలన్నారు.
ఏలేరు ఆధునీకరణపై వైఎస్సార్‌కి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు, జగన్‌లకు లేదన్నారు. రైతులను ఏలేరు నిండా ముంచిందని, వేల ఎకరాల పంట నీట మునగటంతో కౌలు రైతులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏలేరు మరమ్మతుల మీద ఎవరూ దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. మరమ్మతులు లేకపోవడంలో రైతులు దారుణంగా నష్టపోయారని, ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టారని అన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం వరద పాలు అయిందన్నారు.
ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. వైఎస్సార్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారని గుర్తు చేశారు. 135 కోట్ల రూపాయలు విడుదల చేసి పనులు మొదలు పెట్టినా, వైఎస్సార్ చనిపోయిన తరువాత ఏలేరు ఆధునీకరణపై ఎవరూ దృష్టి పెట్టలేదనారు. జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు తప్పులు వేసుకుంటున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదని, గత 10 ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణపై జగన్, చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారన్న షర్మిల, డ్యాంలు కొట్టుకుపోతున్నా జగన్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లిందని అన్నారు. చంద్రబాబు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్తా అన్నారని, ఆ డబ్బులు ఏ మూలకు సరిపోతుందో చెప్పాలని నిలదీశారు. కనీసం ఎకరాకు 25 వేల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి సంవత్సరం 4 వేల కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారం కోసం కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని, జగన్ చేసిన మోసం మళ్లీ చంద్రబాబు చేయొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో రైతులకు జరిగిన నష్టంపై వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని చిన్న చూపు చూస్తుందని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారని మండిపడ్డారు.