Chandrababu Meets Amit Shah in Delhi : రాష్ట్ర విభజన, గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ విధ్వంస పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర సాయం కోరుతున్న చంద్రబాబు బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గత రాత్రి దిల్లీ వెళ్లిన ఆయన, కృష్ణమీనన్‌మార్గ్‌లోని నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గంటకుపైగా భేటీ సాగింది. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.
'కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మంచిది' - చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి - cbn delhi tour
Today in New Delhi, I met with the Hon'ble Union Home Minister, Shri @AmitShah Ji, to apprise him of the devastating condition of finances that Andhra Pradesh had slipped into over the past five years. I also discussed the findings of the four White Papers released, outlining the… pic.twitter.com/xDrcOZR1jO
— N Chandrababu Naidu (@ncbn) July 16, 2024
విభజన చట్టంలోని అంశాల్ని వేగంగా పరిష్కరించడంతోపాటు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన రహదారులను బాగు చేసేందుకు చేయూత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని అనుసంధానించేందుకు కొత్త జాతీయ రహదారులు, రైలు మార్గాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. దక్షిణాదిలో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యల్పమనే విషయాన్ని గమనంలోకి తీసుకొని రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం విన్నవించారు.
అమిత్‌షాతో భేటీ వివరాలను చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ విధ్వంస పాలనపై ఇప్పటి వరకూ విడుదల చేసిన 4 శ్వేతపత్రాల్లోని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో విపరీతంగా పెరిగిన అప్పుల భారంతో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిన విషయాన్ని వివరించానని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ దుష్పరిపాలన, విపరీతమైన అవినీతివల్ల ఏపీకి పూడ్చలేని నష్టం జరిగిందని అమిత్‌షాకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తిరిగి పట్టాలెక్కిస్తామని సీఎం పేర్కొన్నారు. రాత్రికి దిల్లీలోనే బస చేసిన చంద్రబాబు 1-జన్‌పథ్‌లోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో పూజలు చేయనున్నారు. అనంతరం తిరిగి విజయవాడ బయల్దేరతారు. ఇప్పటి వరకు దిల్లీ వచ్చినప్పుడు 50-అశోకారోడ్డులో బస చేసిన సీఎం ఇకపై 1-జన్‌పథ్‌లో దిగనున్నారు.
"దటీజ్ చంద్రబాబు" హాట్‌టాపిక్‌గా దిల్లీ తొలి పర్యటన- నాడు జగన్ 29సార్లు - CBN Delhi Tour