Andhra Pensioners Party Chief Subbarayan Fire on YSRCP Govt: రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును కాదని, గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సమయానికి పింఛను, ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని, ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఉద్యోగులు, పింఛనుదారుల సమస్యలపై ప్రశ్నించేందుకే ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ స్థాపించానని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
"రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా టీడీపీ హయాంలో ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛను ఇచ్చేవారు. పీఆర్సీ ఫిట్‌మెంట్ 43%, 10నెలల బకాయిలు ఇచ్చారు. 70ఏళ్లకు 10% అదనపు పింఛను ఇచ్చారు. ఇప్పుడు మేనిఫెస్టోలోనూ ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారు. ఒకటో తేదీన పింఛన్లు చెల్లిస్తామని, బకాయిలు చెల్లించే ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.
ఏనాడూ ఒకటో తేదీన ఇవ్వలేదు: జగన్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఒకటో తేదీన పింఛను ఇవ్వలేదు. కొన్ని నెలలు 18వ తేదీ వరకు పడలేదు. దీనివల్ల వృద్ధాశ్రమాల్లో ఉండే కొందరు విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. అనారోగ్యాలు ఉన్నవారు మందులు కొనుక్కోవడానికీ కష్టాలు పడాల్సి వచ్చింది. మధ్యంతర భృతి 27% ఇచ్చి ఫిట్‌మెంట్ 23%కి పరిమితం చేశారు. దీంతో జీతాలు, పింఛన్లు తగ్గిపోయాయి. ఇలా తగ్గించిన ఘనత జగన్‌దే.
వృద్ధాప్యంలో ఉద్యోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదనపు పింఛనులో కోత వేసింది. పెద్దవారిపై కనికరం లేకుండా వ్యవహరించింది. 70 ఏళ్లకు 10% పింఛను చంద్రబాబు ఇస్తే జగన్ దాన్ని 7%కు తగ్గించారు. 75-80 ఏళ్లకు 15% పింఛను ఉంటే దాన్ని 12%కు తగ్గించారు.
ఎప్పుడిస్తారో తెలియదు: జగన్ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల డబ్బులు చూడకుండానే చాలామంది చనిపోయారు. 2019 నుంచి ఒక్కో పింఛనుదారు రూ.2.50-3 లక్షలకు బకాయిలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు. రూ.1,500 కోట్లను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. 2018 జులై, 2019 జనవరి డీఆర్‌లకు సంబంధించి 66 నెలల బకాయిలు ఇవ్వలేదు.
- 2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఆర్ దాదాపు 54 నెలల బకాయిలు చెల్లింపుపై స్పష్టత లేదు. 2022, 2023 డీఆర్ బకాయిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
- కొంతమందికి అకారణంగా పింఛను నిలిపివేస్తున్నారు. అలాంటి వాళ్లు నాకు ఫోన్‌చేస్తే ఆర్థికశాఖను సంప్రదిస్తున్నా. గతంలో కంప్యూటర్ తప్పు కారణంగా మధ్యంతర భృతి ఎక్కువగా ఇచ్చినందున ఇప్పుడు పింఛను నిలిపివేసినట్లు చెబుతున్నారు. ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉన్నా దాన్ని పాటించడంలేదు. ఆర్థికశాఖకు పంపిన దస్త్రాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సకాలంలో క్లియర్ చేయడం లేదు. దీంతో కొందరికి నెలల తరబడి పింఛన్లు ఆగిపోతున్నాయి.
ఆసుపత్రి బిల్లులూ రావట్లేదు: ఉద్యోగులు, పింఛనుదారులు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు గతంలో ఎప్పుడూ లేవు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యకార్డులను చాలా ఆసుపత్రులు అనుమతించడం లేదు. చికిత్స చేయించుకుని బిల్లులు పెట్టినా సకాలంలో రావు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయంపై జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించి, వివరిస్తున్నాం. జగన్‌ను ఓడించాలన్నదే మా లక్ష్యం. పింఛనుదారుల సమస్యలపై నిత్యం నాకు ఫోన్లు వస్తున్నాయి. అవి వింటే బాధేస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నాం" అని సుబ్బరాయన్ తెలిపారు.