CBN Leadership qualities : కృష్ణమ్మ ఒడ్డున బెజవాడ నగరం నిశ్చింతగా నిదురోతున్న సమయాన వరద విరుచుకుపడింది. రోజంతా ఉద్యోగ, ఉపాధి, కూలి పనులకు వెళ్లిన జనమంతా ఆదమరిచి ఉన్న వేళ వరద పంజా విసిరింది. కలలోనూ ఊహించని ప్రమాదం.. కళ్లెదుటే కన్నీటి ప్రవాహం.. చుట్టూ చీకటి.. కలా? నిజమా! అని తేరుకునేలోగా వీధులు జలమయమయ్యాయి. పీకల్లోతు నీళ్లలో ఇళ్లు తేలిపోతున్నాయి. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి. గంటల వ్యవధిలో నిశీధి తొలగిపోయి తెల్లారింది కానీ, బతుకు చీకట్లు కమ్ముకున్నాయి.
ఊహించని విపత్తులో విజయవాడ సగం విలవిల్లాడింది. సరిగ్గా అప్పుడే ప్రభుత్వం మేల్కొంది. కంటికి కనిపించని శత్రువుపై యుద్ధానికి సిద్ధమైంది. ప్రభుత్వాధినేతగా చంద్రబాబు వరద సహాయక చర్యలపై పాంచజన్యం పూరించారు. స్వయంగా తానే రంగంలోకి దిగారు. ప్రజలను ఎలాగైనా కాపాడుకోవాలన్న బలమైన సంకల్పం.. ఏడు పదుల వయస్సులోనూ ఆయన్ని యువకుడిలా అడుగులు వేయించింది.
'వరదలు రావడం మా దురదృష్టం.. కానీ, ఈ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం' వరద బాధిత ప్రాంతాల్లో తనను పలకరించిన హోంమంత్రి అనితతో ఓ యువకుడు చేసిన వ్యాఖ్యలివి. ఊహించని విపత్తు బారి నుంచి చంద్రబాబు తమను ఎలాగైనా కాపాడుతారనే నమ్మకం ఆ ఒక్క యువకుడిలో మాత్రమే కాదు.. అందరిలోనూ బలంగా నాటుకుంది. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఫలించకపోవడానికీ చంద్రబాబుపై విశ్వాసమే మూలం. చంద్రబాబు పాలనా అనుభవం, నాయకత్వ సామర్ధ్యంపై కేంద్రానికీ ఓ అంచనా ఉంది. "మీరు ఉన్నారు కదా.. భయం లేదు" అని స్వయంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం అందుకు అద్దం పడుతోంది. హుద్‌హుద్ తుఫాను సమయంలో చిగురుటాకులా వణికిపోయిన విశాఖను కాపాడుకున్న వైనాన్నీ గుర్తుచేస్తోంది.
ఆగస్టు 31 మొదలుకుని (సెప్టెంబర్ 11) నేటికీ చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపై నిత్యం సమీక్షిస్తున్నారు. రోజులో ఒక పూట నేరుగా ఆయనే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మరోపూట అధికారులతో సమావేశమై సమీక్షలు చేస్తున్నారు. మూడోపూట టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మంత్రులతో సహా అందరినీ అప్రమత్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు "నమ్మిన బంటు" మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు కట్టపైనే వాలిపోయారు. తమ అధినేత స్ఫూర్తితో బుడమేరు గండ్లు పూడ్చేవరకూ కదిలేది లేదంటూ భీష్మించుకున్నారు. వాన దంచి కొడుతున్నా, ఈదురుగాలులు వణికిస్తున్నా కట్టపైనే కుర్చీ వేసుకుని పట్టువదలని విక్రమార్కుడిలా గండ్ల పూడ్చివేత విజయవంతంగా పూర్తి చేశారు.
వరద సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. రేషన్ పంపిణీ వాహనాలు వేలాదిగా బారులుదీరాయి. ఇంటింటికీ పాలు, ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యంగా.. ఐఏఎస్ అధికారులు మొదలుకుని క్షేత్రస్థాయిలో అన్ని శాఖలూ శ్రమించాయి. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బృందాలు సహాయక చర్యల్లో పాల్పంచుకున్నాయి. ప్రతీ బాధితుడికి ఆహారాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించాయి.
చంద్రబాబు పిలుపుతో ఎంతో మంది స్వచ్ఛందంగా కదిలారు. ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, వ్యాపారులు, రాజకీయ వేత్తలు ఆర్థికంగా చేయూత అందించారు.
సీఎం ఆదేశాలతో రాష్ట్ర యంత్రాంగమంతా రెక్కలుగట్టుకుని విజయవాడలో వాలిపోయింది. అన్ని ప్రాంతాల నుంచి పారిశుధ్య సిబ్బంది, అగ్నిమాపక దళాలు చేరుకున్నాయి. సహాయక చర్యలతో పాటు వరద నీటి తరలింపు సహా పునరుద్ధరణ పనులు ఊపందుకున్నాయి. ఇంటింటా పేరుకున్న బురదనీటిని తొలగించే పనులు జోరందుకున్నాయి. జలమయమైన రోడ్లు, వీధులన్నీ పరిశుభ్రమయ్యాయి. వెరసి బుడమేరు తాకిడికి అల్లాడిన విజయవాడ శరవేగంగా కోలుకుంటోంది. పట్టుమని పదిరోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంది.