Supreme Court on SC Classification : ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ(SC Classification)పై భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పంజాబ్ గవర్నమెంట్ వేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా స్వీకరిస్తూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను కూడా విచారించింది. అయితే వర్గీకరణపై దాఖలైన అన్ని పిటిషన్లను పంజాబ్ పిటిషన్‌కు న్యాయస్థానం జత చేసి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ గతంలో సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు రాష్ట్ర మంత్రి దామోదర రాజ నరసింహ హాజరయ్యారు.
వర్గీకరణకు శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా : విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రశ్నలను సంధించింది. అసమానతల తొలగింపునకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. వర్గీకరణకు రాష్ట్ర శాసనసభలు సిద్ధంగా ఉన్నాయా అంటూ వివరణ కోరింది. ఈ కేసు విచారణలో భాగంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను రాజ్యాంగ ధర్మాసనం తెలుసుకోనుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుపై బీజేపీ నిలువునా మోసం చేసింది: పేరుపొగు వెంకటేశ్వరరావు
SC Classification : 2004లో చంద్రబాబు సర్కారు కల్పించిన వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది.
ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, గిరిజన, న్యాయశాఖ, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు ఉన్నారు. ఈ విషయాలను అన్నింటిని పరిగణలోకి తీసుకున్న సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టి ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇవ్వడం తెలిసిందే.