What Industry Expect from the New IT Policy in AP : ఎక్కడ సంక్షోభం ఉంటుందో అక్కడే అవకాశాలు ఉంటాయి. ధైర్యంగా నిలబడి భవిష్యత్‌లోకి చూడగలిగితే చాలు. ముందుండేది విజయ ప్రస్థానమే. రాష్ట్రం సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే నిలిచింది. మానని విభజన గాయాలు, వైఎస్సార్సీపీ విధ్వంస పాలనలో మిగిలిన శిథిలాలు, లక్షలాది యువత ఆకాంక్షల మధ్య ఆశాకిరణంగా కనిపిస్తోంది ఐటీ బాట. సైబర్ సిటీతో భాగ్యనగరానికి కొత్త నగ అద్దిన వారియర్ నాయకత్వంలో త్వరలోనే ఐటీ విధానాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతో ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది సంకల్పం. అది నెరవేరాలంటే ఏం చేయాలి? ఐటీ పాలసీ, ప్రభుత్వం నుంచి పరిశ్రమ ఏం ఆశిస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏపీ డిజిటల్ లీడర్‌షిప్ ఫోరమ్ కన్వీనర్ శ్రీధర్ కొసరాజు, ఇన్వెంటిజ్ సీఈవో ఇంద్రజిత్ అన్నె పాల్గొన్నారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా ఐదు సంవత్సాల్లో సుమారు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అందుకు అనుగుణంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ESDM), సెమీకండక్టర్, డేటా సెంటర్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీలను రూపొందిస్తోంది. వాటితో పాటు భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉన్న కృత్రిమ మేధ (AI), డ్రోన్ పాలసీలను కొత్తగా తీసుకురాబోతోంది. వాటికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు పూర్తయింది.
ఐటీలో ఏపీని బలంగా పునర్నిర్మించడం ఎలా? అందుకోసం ఏం చేయాలి? - pratidwani on IT Industry In AP
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐటీ రంగానికి ప్రాధాన్యం కల్పించకపోవడంతో ఆశించిన స్థాయిలో పురోగతి రాలేదు. దీంతో ఇప్పటికే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కొత్త కంపెనీలకు కేటాయించి, డిమాండ్‌కు అనుగుణంగా నూతన పార్కులను అభివృద్ధి చేయాలని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ (Millennium Towers)లో అందుబాటులో ఉన్న మూడు లక్షల చదరపు అడుగుల్లో 1,92,563 చ.అ.ఖాళీగా ఉంది. దాన్ని కొత్త కంపెనీలకు చ.అ. రూ.45కు కేటాయించాలని భావిస్తోంది.