Murder of a young man in Bapatla District : ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే బాపట్ల పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఓ యువకుడి హత్యకు దారి తీసింది. నిత్యం రద్దీగా ఉండే బాపట్ల సూర్యలంక రహదారిపై రక్తం ధారలై పారింది. ఏం జరుగుతుందో అని స్థానికులు తెలుసుకునే లోపల మారణాయుధాలతో పదుల సంఖ్యలో వచ్చిన యువకులు ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. పట్టణ శివారు కనకాద్రి నగర్ లో ఓ రెస్టారెంట్ సమీపంలో జరిగిన ఘటనలో గోరంట్ల వెంకట సుమంత్ (25) మంగళవారం రాత్రి ( ఫిబ్రవరి 6) ప్రాణాలు కోల్పోయాడు.
రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ విలనే! తహసీల్దారు హత్య కేసులో సంచలన విషయాలు
పట్టణంలో పెయింటర్స్ కాలనీకి చెందిన వెంకట సుమంత్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ కోర్సు చేస్తున్నాడు. మంగళవారం ఉదయమే సొంతూరు వచ్చాడు. స్నేహితులు సోను, రాహుల్, మరో ఇద్దరితో కలసి పట్టణంలో కారులో తిరుగుతూ మద్యం తాగారు. మధ్యాహ్న సమయంలో చీల్ రోడ్డు ప్రాంతంలో ఓవర్గం యువకులతో గొడవపడిన వీరు కత్తులు తీసి బెదిరించినట్లు తెలిసింది. రాత్రి 7 గంటల సమయంలో పట్టణ శివారు కనకాద్రి నగర్ సమీపంలో ఓ రెస్టారెంట్లో తినేందుకు వచ్చారు. తనను కత్తులతో బెదిరిస్తారా? అని వీరిని వెతుక్కుంటూ మరో వర్గానికి చెందిన 30 మంది యువకులు మారణాయుధాలతో ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వచ్చారు. రాహులు, సోను బృందం వచ్చిన కారు రెస్టారెంట్ సమీపంలో ఉండటం గమనించి సిమెంటు రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. వీరి ఆచూకీ సిబ్బందిని అడిగారు. అప్పటికే లోపల ఉన్న రాహుల్ బృందాన్ని వెంటనే వెళ్లి పోవాలని సిబ్బంది హెచ్చరించారు. సోను, వెంకట సుమంత్, రాహుల్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి సూర్యలంక రోడ్డులో యువకులకు కనిపించారు.
తహసీల్దార్ రమణయ్య హత్య కేసు - నిందితుడు సుబ్రమణ్యం అరెస్ట్
విచక్షణ రహితంగా కత్తులతో దాడి : వారు ముగ్గురు కనిపించిన వెంటనే మరో వర్గం యువకులు దాడికి తెగబడ్డారు. సోను పరిగెత్తి తప్పించుకోగా తమకు చిక్కిన సుమంతు, రాహులను కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలైన సుమంతు రోడ్డు పక్కనే పడి మృతి చెందగా, తన వద్ద ఉన్న కత్తితో రాహుల్ ఎదురు దాడికి దిగి గాయపడ్డాడు. వెంటనే చేరాల ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకున్నారు. సుమంత్ మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రి మార్చరికి పోలీసులు తరలించారు. జీవితంలో స్థిరపడాలని హైదరాబాద్ వెళ్లి స్టాప్ట్‌వేర్ శిక్షణ తీసుకుంటున్న తమ కుమారుడు స్నేహితులతో తిరుగుతూ మృతి చెందడాన్ని చూసిన సుమంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జాతీయ రహదారి సమీపంలో సూర్యలంక మార్గంలో నడిరోడ్డుపై కత్తులు, మారణాయుధాలతో చెలరేగుతూ యువకుల బృందం దాడి చేసిన దృశ్యాలను అటుగా వెళుతున్న వాహనదారులు, స్థానికులు చూసి భయభ్రాంతులకు గురయ్యారు.
బాపట్ల గ్రామీణ, పట్టణ సీఐలు హజరత్‌బాబు, శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సంఘటన స్థలంలో అనుమానస్పదంగా మరో కారు నిలిచి ఉంది. రెస్టారెంట్ సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడ్డారని భావిస్తున్న వినోద్, యాసిన్ చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చారని సమాచారంతో అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తరలించారు. చీల్ రోడ్డు వద్ద రాహుల్, సోను బృందం తనపై బెదిరించి దాడికి ఎత్తించారని పట్టణ పోలీసులకు యాసిన్ సాయంత్రమే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ హత్య జరిగే అవకాశం ఉండేది కాదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
రెచ్చిపోయిన ఎర్ర చందనం స్మగ్లర్లు - కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు
స్థానికంగా చెలరేగుతున్న గ్యాంగులు :
పట్టణంలో కొందరు యువత దారి తప్పి మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి గ్యాంగులుగా ఏర్పడి దాడులకు తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం రైల్వే స్టేషన్ వద్ద యువకుల బృందం మద్యం మత్తులో ఆటో డ్రైవర్ పై దాడి చేయబోయారు. రెండేళ్ల క్రితం ఇస్లాంపేటలో రెండు వర్గాలు మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. ఘర్షణలకు పాల్పడే గ్యాంగులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ హత్య చోటు చేసుకుందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు వీరి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారుల మద్దతు వల్ల అడ్డు అదుపు లేకుండా గ్యాంగులు చెలరేగిపోతున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.