Yashwanth Got MS Seat in New York University: కలలు ముందుకే వెళ్లమని తొందరపెట్టినా ఆర్థిక పరిస్థితులు వెనక్కిలాగటంతో బీటెక్ పూర్తికాగానే వచ్చిన ఉద్యోగంలో చేరిపోయాడు ఈ యువకుడు. అయినా చదువు కొనసాగించలేకపోయానే అన్న దిగులు వెంటాడుతూనే ఉండేది. ఓ దశలో అనారోగ్య సమస్యలూ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయినా లక్ష్యాన్ని మరువలేదు. దిశానిర్దేశం చేసేవారు లేకున్నా సాంకేతికత తోడుగా చేసుకుని 170 ఏళ్ల చరిత్ర కలిగిన న్యూయార్క్ యూనివర్సిటీలో సీటు దక్కించుకున్నాడు.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దామర్ల యశ్వంత్ కుమార్‌ది దిగువ మధ్య తరగతి కుటుంబం. స్వర్ణకారుడిగా తండ్రికి నిలకడైన ఆదాయం వచ్చేది కాదు. దీంతో తనలా ఇబ్బంది పడకూడదంటే బాగా చదవాలంటూ తండ్రి చెప్పిన మాటలు యశ్వంత్ మనసులో బలంగా నాటుకుపోయాయి. అప్పటినుంచి చదువుల్లో ముందంజలో ఉండాలని నిత్యం కష్టపడేవాడు.
తండ్రి సంపాదనపైనే ఇల్లు గడిచే పరిస్థితి ఉండటంతో ఇష్టాలను పక్కనపెట్టి టీసీఎస్ కంపెనీలో సిస్టమ్ ఇంజినీర్‌గా చేరాడు యశ్వంత్. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత ఎంఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మధ్యలో కరోనా వల్ల తీవ్ర అనారోగ్యం పాలైనా మళ్లీ సాధన చేశాడు. ఈ మధ్యే ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన న్యూయార్క్ యూనివర్సిటీ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో బీటెక్ తర్వాత ఎంఎస్ చేయాలనే కోరిక విరమించుకున్నాను. కాస్త ఆలస్యంగానైనా నా కల నెరవరబోతుండటం ఆనందంగా ఉంది. నా పరిశోధనా పత్రాలు ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితం కావడంతో న్యూయార్క్ యూనివర్సిటీ ఎంఎస్ సీటు ఆఫర్ చేసింది. -యశ్వంత్
చాలా తక్కువ మందికే దక్కే అవకాశం తనకు లభించిందని, భారత్‌లోని ఐఐటీలకు బదులుగా అమెరికానే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వివరిస్తున్నాడు యశ్వంత్. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించిన యశ్వంత్‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. అవసరమైతే ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని అంటున్నాడు యశ్వంత్. భవిష్యత్తులో కచ్చితంగా భారత్‌లో కంపెనీ స్థాపించి దేశాభివృద్ధిలో భాగం కావడమే తన అంతిమ లక్ష్యమని చెబుతున్నాడు యశ్వంత్.
పిల్లల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని సొంతూరి నుంచి మంగళగిరికి వచ్చాం. తాము పడే కష్టం చూసి పిల్లలూ పట్టుదలతో చదివి ఈ స్థాయికి వచ్చారు. -దామర్ల సాయి, యశ్వంత్ తండ్రి
సంకల్పం గట్టిదైతే సాధించాలనే లక్ష్యం ఎంత గొప్పదైనా తలొంచి తీరుతుందని అంటున్నాడు యశ్వంత్. చదువు పూర్తయ్యాక కంపెనీ స్థాపించి స్వదేశం కోసం కృషి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు.