Financial Assistance for Food Processing Industries : మీరు సొంతంగా ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ? బాగా కష్టపడి గొప్ప పారిశ్రామికవేత్తగా మారాలనుకుంటున్నారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! మీ దగ్గర మంచి బిజినెస్ ఐడియా, యూనిట్ పెట్టుకోవడానికి 10% పెట్టుబడి ఉంటే చాలు. ఇక మీరు వ్యాపారంలో రాణించేందుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం(పీఎంఎఫ్ఎంఈ) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. ఈ స్కీమ్ కింద 35% రాయితీ (గరిష్ఠంగా రూ.10లక్షల వరకు) ఇస్తుంది. అలాగే బ్యాంక్ లోన్ కూడా పొందవచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొంతమందికి కూరలు చేయడం, పచ్చళ్లు పెట్టడం, కారం పొడి చేయడం, ఒడియాలు పెట్టడంలో ప్రావీణ్యం ఉండొచ్చు. అలాగే మరికొందరికి మినీ దాల్మిల్ పెట్టాలనే ఆసక్తి ఉండొచ్చు. కొందరు ఆక్వా ఆధారిత ఉత్పత్తులు, పప్పులు చేద్దామనీ అనుకోవచ్చు. ఇలాంటి వారందరికీ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద లోన్లు అందిస్తారు.
యూనిట్ ఏదైనా దానికయ్యే ఖర్చులో సొంత వాటాగా 10 శాతం మీరు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ప్రభుత్వం 35 శాతం రాయితీ ఇచ్చి బ్యాంకు లోన్ 55 శాతం అందేలా చేస్తుంది. తద్వారా మీరు ఓ పారిశ్రామికవేత్తగా మారి మీ చుట్టూ ఉండే పదిమందికి ఉపాధి కల్పించవచ్చు. ఉత్పత్తుల క్యాలిటీ ఆధారంగా మార్కెట్లో ఒక బ్రాండ్ సృష్టించుకునే అవకాశమూ ఉంది. ఇప్పటికే యూనిట్లు ఉన్నా లోన్ తీసుకొని విస్తరించుకోవచ్చు.
యూనిట్ వ్యయం: రూ. 5 లక్షలు లోపు
ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు : పిండి మరలు, వెజ్, నాన్‌వెజ్ పచ్చళ్లు, మిరప, పసుపు, మసాలా పొడులు, పూతరేకులు, కొబ్బరిపొడి, కొబ్బరి బర్ఫి, రొట్టెలు, అరటి చిప్స్, కేక్స్, ఇడ్లీ, దోశ పిండి తయారీ, ప్యాకింగ్. ఒడియాలు, అప్పడాలు, వేరుసెనగ చక్క, ఫ్లేవర్డ్ మిల్క్, సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు సహా ఎలాంటివైనా పెట్టుకోవచ్చు.
యూనిట్ వ్యయం: రూ.5 లక్షలు - రూ.10లక్షలు
ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు : వంటనూనెలు, నూడుల్స్, చాక్లెట్లు, ఛీజ్, పన్నీర్, సేమియా, చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు, జెల్లీ, పండ్ల జామ్, చపాతీ, పరోటా, అరటి పొడి, పశువుల దాణా తయారీ, మిల్లెట్ ఫ్లేక్స్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్ పౌడర్, అల్లం-వెల్లుల్లి పేస్టు, నన్నారి, పానిపూరీ తయారీ.
యూనిట్ వ్యయం: రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు
ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు : మినీ ధాన్యం, పప్పు మిల్లులు, సాస్, జెల్లీ, కెచప్, తేనె శుద్ధి, ప్యాకింగ్, నూనెల తయారీ, ఇన్స్టెంట్ ప్రీమిక్స్(గులాబ్జాం, ఖీర్, కేక్ మిక్స్‌లు), చిరుధాన్యాల ఆధారిత ప్రాథమిక ఆహారశుద్ధి యూనిట్లు, కొబ్బరిపాలు తయారీ మొదలైనవి.
యూనిట్ వ్యయం: రూ.20లక్షల నుంచి రూ.35లక్షలు
ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు : ఐస్‌క్రీమ్, స్క్వాష్‌లు, పరోటా, చపాతి, మిల్లెట్ పాస్తా, సోయా ప్రాసెసింగ్, రవ్వ, పిండి యూనిట్లు, కొబ్బరినీటి సీసాలు, పిల్లల పోషకాహారం తయారీ, ఫ్రూట్ బార్స్ తదితరాలు.
యూనిట్ వ్యయం: రూ.35లక్షల నుంచి రూ.50లక్షలు, ఆపైన
ఎలాంటి యూనిట్లు?:
పశువుల దాణా, కాఫీ ప్రాసెసింగ్, లెమన్ ప్రాసెసింగ్, జీడిమామిడి పరిశ్రమలు, చేపలు, మాంసం ప్రాసెసింగ్, ప్రొబయోటిక్ డ్రింక్స్, మిల్క్ చిల్లింగ్, చెరకు ఆధారిత బెల్లం, సిరప్ తయారీ, బెల్లం పొడి, మొక్కజొన్న ఆధారిత ఉత్పత్తులు, పండ్ల రసాల యూనిట్ తదితరాలు
పొదుపు సంఘాల మహిళలకు ప్రోత్సాహకాలు :
పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. ముడిసరకు, ప్యాకింగ్, ఇతరత్రా పెట్టుబడిగా వాడుకుని తర్వాత పొదుపు సంఘానికి చెల్లించాలి. వీరు కూడా 35 శాతం రాయితీపై లోన్ తీసుకొని యూనిట్ విస్తరించుకోవచ్చు.
"పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద చిన్న మొత్తంతో కూడా యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. తమ ప్రాంతంలో ఉండే ముడిసరకుల ఆధారంగా ఉప ఉత్పత్తులు రెడీ చేసుకోవచ్చు. గరిష్ఠంగా రూ.10లక్షల వరకు 35 శాతం రాయితీ అందిస్తాం. ఎన్ని యూనిట్లు అయినా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది." - జి.శేఖర్‌బాబు (సీఈఓ, ఆహారశుద్ధి సొసైటీ)
ఎలా అప్లై చేసుకోవాలి ?
జిల్లా, మండల స్థాయిలోని రిసోర్స్‌పర్సన్స్ ద్వారా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవచ్చు. యూనిట్‌కు సంబంధించిన వివరాలతో ఆన్లైన్లో https://www.pmfmeap.org/ అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నంబరు: 040- 45901100 సంప్రదించవచ్చు.
- ఆధార్, పాన్‌కార్డ్, యూనిట్ చిరునామా ధ్రువీకరించే డాక్యుమెంట్ (విద్యుత్తు/వాటర్/ఫోన్/గ్యాస్ బిల్), యూనిట్ నిర్వహించే భవనం/భూమి యాజమాన్య ధ్రువీకరణ, గత ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్, యంత్రాలు, షెడ్‌కు సంబంధించిన కొటేషన్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్‌ను రిసోర్సుపర్సన్ చెక్ చేసి జిల్లాస్థాయి కమిటీకి సిఫారసు చేస్తారు. కలెక్టర్ అధ్యక్షతన ఉండే ఈ కమిటీ యూనిట్ వివరాలు చెక్ చేసి బ్యాంకుకు పంపిస్తుంది. పర్సనల్ లోన్ హిస్టరీ బాగుంటే బ్యాంకు లోన్ మంజూరు చేస్తుంది. తర్వాత మూడు నెలల్లోపు రాయితీ సొమ్ము బ్యాంకు అకౌంట్‌కు జమవుతుంది.
పందెంలో గెలిస్తే కాసులు కురిపిస్తా - ఓడితే నోరూరిస్తా - చనిపోయిన కోడికి రూ.లక్ష!
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు - ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల తేదీలు ఎప్పుడంటే