How To Apply Minor PAN Card : ఇండియాలో పన్ను చెల్లించే వారందరికీ పాన్ కార్డు ఉండాల్సిందే. అయితే.. పిల్లలు కూడా పాన్ కార్డు పొందడానికి అర్హులే అన్న సంగతి మీకు తెలుసా? ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 160 ప్రకారం.. పాన్ కార్డు పొందడానికి వయసు నిబంధన అంటూ ఏదీ లేదు. కాబట్టి.. మైనర్లూ పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే.. పిల్లలు సొంతంగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోలేరు. వారి తరపున పేరెంట్స్ లేదా గార్డియన్ పాన్ కార్డు(PAN Card) కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. మరి.. పిల్లలకు పాన్ కార్డు ఎప్పుడు అవసరం? అందుకు కావాల్సిన పత్రాలేంటి? ఎలా అప్లై చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలకు పాన్ కార్డ్ ఎప్పుడు అవసరమంటే?
- పిల్లల పేరు మీద పేరెంట్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వారికి పాన్ కార్డు తప్పనిసరిగా అవసరం.
- అలాగే.. బ్యాంక్ లేదా ఇతర సంస్థల్లో మీ పెట్టుబడికి మీ బిడ్డ నామినీగా ఉంటే.. ఆ టైమ్‌లో కూడా పిల్లలకు పాన్ కార్డు ఉండాలి.
- పిల్లల పేరుతో ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు లేదా కూతురు కోసం సుకన్య సమృద్ధి యోజన(SSY) అకౌంట్‌ను ఓపెన్ చేసేటప్పుడు మీ పిల్లల పాన్ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది.
- అదేవిధంగా.. ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఒక మైనర్ అబ్బాయి లేదా అమ్మాయి జాబ్ చేస్తూ ITR ఫైల్ చేయవలసి వస్తే వారికి పాన్ కార్డ్ అవసరం ఉంటుంది.
మీ పాన్ కార్డ్ పోయిందా? డోంట్ వర్రీ - ఈజీగా డౌన్లోడ్ చేసుకోండిలా!
మైనర్ పాన్ కార్డ్ కోసం కావాల్సినవి :
- పేరెంట్స్ అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్
- దరఖాస్తుదారుడి ఐడెంటిటీ ప్రూఫ్(ఆధార్, రేషన్ కార్డ్ వంటివి)
- గార్డియన్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం.. ఆధార్(Aadhaar), రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు వంటివి అవసరమవుతాయి.
- అడ్రస్ ప్రూఫ్ కోసం.. ఆధార్, పోస్టాఫీస్ పాస్ బుక్, ఆస్తి నమోదం పత్రం వంటివి సబ్మిట్ చేయొచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే?
- ఇందుకోసం ముందుగా ఎన్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. ఫారమ్ 49A డౌన్లోడ్ చేసుకోవాలి.
- అనంతరం అందులో సూచనలను జాగ్రత్తగా చదివి.. కేటగిరీ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి.
- అనంతరం.. పిల్లల వయసు నిర్ధారిత డాక్యుమెంట్, ఇతర అవసరమైన పత్రాలు, పేరెంట్స్ ఫొటో అప్‌లోడ్ చేయాలి.
- అదేవిధంగా అక్కడ పేర్కొన్న ఫార్మాట్ ప్రకారం.. పేరెంట్స్ సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ లేదా ఎన్‌ఎస్‌డీఎల్ ఆఫీస్ నుంచి 49A ఫారమ్‌ను తెచ్చుకోవాలి.
- అనంతరం సూచనలు చదివి అందుకు అనుగుణంగా వివరాలన్నీ నమోదు చేయాలి.
- తర్వాత పిల్లల రెండు ఫొటోలు, అవసరమైన పత్రాలు దానికి అటాచ్ చేసి దగ్గరలోని ఎన్‌ఎస్‌డీఎల్ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. అలాగే ప్రాసెస్ ఫీజు కూడా చెల్లించాలి.
- అంతే ప్రాసెస్ పూర్తి అనంతరం సంబంధిత చిరునామాకు మైనర్ పాన్ వచ్చేస్తుంది.
ఈ విషయం మరవద్దు :
మైనర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న పాన్ కార్డ్.. 18 ఏళ్లు నిండిన తర్వాత చెల్లదనే విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. ఎందుకంటే.. అందులో పిల్లల ఫోటో లేదా సంతకం ఉండదు. కాబట్టి.. అది ఐడీ ప్రూఫ్‌గా పనిచేయదు. అందుకే.. పిల్లలు మేజర్ అయ్యాక తప్పనిసరిగా పాన్ కార్డ్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పాన్ కార్డు దరఖాస్తు టైమ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? ఇక అంతే!