Maruti Car Recall Check : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తోంది. బాలెనో, వ్యాగన్ఆర్ మోడళ్లకు చెందిన 16,000కుపైగా యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్యూయల్ పంప్‌లో ఉన్న లోపాలను సరిచేసేందుకు గాను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఫ్యుయెల్ పంప్ మోటార్ భాగంలో లోపం
2019 జులై 30వ తేదీ నుంచి 2019 నవంబర్ 1వ తేదీ మధ్య కాలంలో తయారైన 11,851 యూనిట్ల బాలెనో, 4,190 వ్యాగన్ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది. ఫ్యుయెల్ పంప్ మోటార్ భాగంలో లోపం ఉన్నట్టు సందేహాలు ఉన్నాయని చెప్పింది. ఇది చాలా సందర్భాల్లో ఇంజిన్ ఆగిపోయేందుకు లేదా ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలకు దారితీస్తుందని వివరించింది.
అంతా ఫ్రీ
అయితే కంపెనీ డీలర్ల నుంచి ఆ రెండు మోడళ్ల వినియోగదారులకు వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని మారుతీ సుజుకీ తెలిపింది. వాహనాన్ని తనిఖీ చేసి ఏదైనా లోపం ఉంటే ఉచితంగా సరిచేస్తామని చెప్పింది. ఇటీవల కాలంలో కంపెనీ రీకాల్ చేసిన సందర్బాల్లో ఇదే అత్యధికమని మారుతీ సుజుకీ తెలిపింది.
కొన్నినెలలు క్రితమే!
మారుతీ సుజుకీ ఇండియా 2023 జులైలో తమ కంపెనీకి చెందిన ఎస్ ప్రెస్సో మోడల్, ఈకో మోడల్ 87,599 యూనిట్లు రీకాల్ చేసింది. ఈ కార్లు 2021 జులై 5 నుంచి 2023 ఫిబ్రవరి 15 మధ్య తయారైనవిగా కంపెనీ పేర్కొంది. స్టీరింగ్ రాడ్ లో సమస్య తలెత్తడం వల్ల దానిని మార్చేందుకు ఈ రీకాల్ చేసింది.
4 నెలలపాటు వెయిట్ చేయాల్సిందే!
మరోవైపు, మారుతీ సుజుకీ కంపెనీ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను పరిచయం చేస్తుంటుంది. అలాగే తమ కార్లను వీలైనంత త్వరగా కస్టమర్లకు డెలివరీ చేస్తుంటుంది. అయితే సాధారణంగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను రూపొందించి, వాటిని డెలివరీ చేయడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే ఏయే మారుతీ మోడల్ కార్లకు ఎంతెంత వెయిటింగ్ పీరియడ్ ఉందో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.