Train Journey Rules : బ్రిటిష్ ఇండియాలో 1853 సంవత్సరంలో ప్రారంభమైన రైల్వే నేటికి దేశంలో అతిపెద్ద రవాణా సాధనంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 68 వేల కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ విస్తరించింది. దేశంలో ఒకరోజులో దాదాపు 2.3 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో రైళ్లను వినియోగించుకుంటున్న ప్రయాణికులు వాటిలో జర్నీ చేస్తున్నప్పుడు పాటించవలసిన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకుందామా?
1.అప్పుడు మాత్రమే చైన్ లాగాలి
Train Chain Pulling Rules : మనం సాధారణంగా ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు చైన్లను చూస్తుంటాం. అయితే వాటిని మెడికల్ ఎమర్జెన్సీ, లేదా ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్‌కు గురైనప్పుడు మాత్రమే లాగాలి. అంతే కాకుండా పిల్లలు, లేదా వృద్ధులు, దివ్యాంగులు ట్రైన్ ఎక్కకముందే రైలు కదిలిన సందర్భంలోనూ లాగవచ్చు. అంతే తప్ప మరే ఇతర సమయాలలో ఎట్టి పరిస్థితుల్లో చైన్ లాగకూడదు.
2. గమ్య స్థానం మార్పు
పండగలు, లేదా ఇతరత్రా రద్దీ సమయాల్లో మనం అనుకున్న ప్రదేశానికి టికెట్ దొరకదు. ఆ సమయంలో మనం అంతకంటే ముందు స్టేషన్‌కు టికెట్ తీసుకోవచ్చు. ప్రయాణ సమయంలో టీసీకి అదనపు రుసుం చెల్లించి మన గమ్య స్థానాన్ని పొడగించుకునే వీలు ఉంటుంది. అయితే మీరు మెుదట కూర్చున్న సీటు మారే అవకాశం ఉంటుంది.
3. రాత్రి పూటే మధ్య బెర్త్!
Train Middle Berth Rule : సాధారణంగా మనం రిజర్వేషన్లో ప్రయాణిస్తున్నప్పుడు మిడిల్ బెర్త్‌లను గమనిస్తాం దాని విషయంలో ఒక ప్రత్యేక నియమం ఉంది. మిడిల్ బెర్త్‌ను ఉదయం వేళల్లో ఉపయోగించరాదు. కేవలం రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకే ఈ బెర్త్‌ను వాడాలి. ఒకవేళ అంతకంటే ముందే దీనిని వాడాలంటే తప్పనిసరిగా లోయర్ బెర్త్ ప్యాసింజర్ అనుమతి తీసుకోవాలి.
4. రెండు స్టాప్ల తర్వాతే సీటు ట్రాన్స్ఫర్
కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సరైన సమయానికి స్టేషన్ చేరక ట్రైన్ మిస్ అవుతుంటాం. అటువంటప్పుడు తరువాతి స్టేషన్లోనూ మనం రైలు ఎక్కవచ్చు. ఎక్కాల్సిన ప్రాంతం నుంచి రెండు స్టేషన్లు దాటిన తర్వాత లేదా గంట ప్రయాణం తర్వాత మాత్రమే మీ సీటును ఇతరులకు కేటాయిస్తారు. ఆలోపే సీటును ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసే అధికారం టీసీకి లేదు.
5. పది తర్వాత నో చెకింగ్!
Train Rules After 10PM : రాత్రి 10 గంటల తరువాత రైలులో ఎటువంటి డిస్టర్బెన్స్ చేయరాదు. టీసీలు సైతం 10 గంటల ముందే వారి టికెట్‌ను పరిశీలించాలి. రాత్రి వేళ ప్రయాణం ప్రారంభించే రైళ్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రైలు బోగీలోని రాత్రివేళ లైట్స్ తప్ప మిగతావన్నీ ఆఫ్ చేయాలి. పుడ్ పార్సిల్ వారు 10 గంటలలోపే వారి సేవలను ముగించాలి.
6. MRP రేట్లకే అమ్మాలి
ట్రైన్లలో తినుబండారాలు, వాటర్ బాటిల్స్ , తదితర వస్తువులు తప్పనిసరిగా MRP ధరకే అమ్మాలి. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే వారికి రైల్వే అధికారులు జరిమానా లేదా వారి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు.
7. పెద్ద శబ్దాలు చేయవద్దు
రైళ్లలో ప్రయాణించేటప్పుడు అధిక శబ్దాలు చేయటం నిషిద్ధం. మన మొబైల్లోనూ ఏవైనా వీడియోలు, సినిమాలు చూస్తున్నప్పుడు తక్కువ శబ్దం పెట్టి చూడటం మంచిది. ఈ నియమాన్ని ఇటీవలే రైల్వే ప్రవేశపెట్టింది. ప్రయాణికుల నుంచి చాలా కంప్లెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నియామాల గురించి రైల్వే అధికారులు, టీటీ లేదా ట్రైన్ క్యాటరింగ్ సిబ్బంది, ప్రయాణికులకు సూచనలు చేయాలి.