Rahul On Modi : ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం చేస్తున్న వేదికపైనే కన్నీళ్లు పెట్టే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, ధరల పెంపు వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని అన్నారు. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మోదీ వివిధ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోకి విజయపుర జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ విమర్శలు గుప్పించారు.
"ఎన్నికల ప్రసంగాల సమయంలో ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఆయన మరికొద్దిరోజుల్లో వేదికపై కన్నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల్ని దృష్టిని మరల్చేందుకు కొన్నిసార్లు చైనా, పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు. మరికొన్ని సార్లు మిమ్మల్ని ప్లేట్‌లను కొట్టమని, మొబైల్ ఫోన్ల టార్చ్‌లైట్‌ను ఆన్ చేయమని అడుగుతారు. కాంగ్రెస్ మాత్రమే నిరుద్యోగాన్ని నిర్మూలించగలదు. ధరల పెరుగుదలను నియంత్రించగలదు"
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
పేదల డబ్బుల లాక్కుని కోటీశ్వరులకు
ప్రధాని మోదీ పేదల వద్ద ఉన్న డబ్బును లాక్కుని, కొందరిని మాత్రమే కోటీశ్వరులను చేశారని రాహుల్ ఆరోపించారు. దేశంలోని 70 కోట్ల మంది ప్రజల సంపదకు 22 మందికి మాత్రమే ప్రధాని మోదీ దోచి పెడుతున్నారని విమర్శించారు. దేశంలోని 40 శాతం సంపదను కేవలం ఒక్క శాతం మందే అనుభవిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని యువతకు రాహుల్ హామీ ఇచ్చారు. భారత సైన్యాన్ని, సైనికులను అవమానించేలా అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని అన్నారు. దేశంలోని యువత నుంచి ఆర్మీ ఉద్యోగాలను ప్రధాని మోదీ లాక్కున్నారని రాహుల్ ఆరోపించారు. కర్ణాటకకు ప్రధాని మోదీ అన్యాయం చేస్తున్నారని అన్నారు.
కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కలిసి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాయి. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రచారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నీ తామై ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.