Odisha New CM BJP : ఒడిశా ముఖ్యమంత్రి ఎవరన్న అంశాన్ని తేల్చేందుకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేందర్‌యాదవ్‌ను కేంద్ర పరిశీలకులుగా భారతీయ జనతా పార్టీ నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ వెల్లడించారు. ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జూన్ 12న నిర్వహించనున్నట్లు అంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి దిల్లీప్ మొహంతి స్పష్టం చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని పేర్కొన్నారు.
అంతా వాయిదా!
అయితే తొలుత జూన్ 10న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భావించినప్పటికీ దానిని 12కు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా తాజా మార్పు జరిగిందని బీజేపీ నేతలు జతిన్ మొహంతి, విజయ్‌పాల్ సింగ్ వెల్లడించారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం, కేబినేట్ తొలి భేటీ కానుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం కూడా జూన్ 11న జరగనుంది. ఈ క్రమంలోనే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.
తెరపైకి సురేశ్ పేరు!
మరోవైపు కొత్త ముఖ్యమంత్రి రేసులో సీనియర్ బీజేపీ నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఈయన దిల్లీ బయలుదేరి వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఆశావహుల జాబితాలో పుజారి పేరు కూడా ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో బార్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రజారాజ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.
రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని పాలించిన బిజూ జనతాదళ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 చోట్ల గెలిచింది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును చెప్పకుండానే ఎన్నికల్లో ముమ్మర ప్రచారం చేసిన కాషాయ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కైవసం చేసుకుంది. కాగా ఒడిశాలో వరుసగా 24 ఏళ్లు అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ఓటమి చవిచూడటం వల్ల ఆ పార్టీ ముఖ్యనేత వీకే పాండియన్ పాండ్యన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు.