Nitish Kumar On India Bloc : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రాంతీయ పార్టీల నుంచి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమ రాష్ట్రాల్లో తాము ఒంటరిగానే పోరాడతామంటూ టీఎంసీ, ఆప్ ప్రకటించిన నేపథ్యంలో విపక్ష 'ఇండియా' కూటమికి చెందిన నీతీశ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేగాక బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్ శతజయంతి వేడుకలో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరీ ఠాకుర్‌కు మోదీ ప్రభుత్వం ఇటీవలే భారతరత్నను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై నీతీశ్ ప్రశంసలు కురిపించారు. '2005లో నేను అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి కర్పూరీ ఠాకుర్‌కు భారతరత్న గురించి కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నోమార్లు అభ్యర్థన చేశాను. చివరకు ప్రస్తుత ప్రభుత్వం కర్పూరీ ఠాకుర్‌కు ఆ పురస్కారం ఇచ్చింది. దీనిపై ప్రధాని మోదీ నుంచి ఫోన్ వచ్చిందని ఠాకుర్ కుమారుడు నాకు చెప్పారు. ప్రధాని నుంచి నాకు ఎలాంటి కాల్ రాలేదు. అయినా సరే కేంద్రం, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్ మీరు తీసుకోవచ్చని నేను ఆయనకు చెప్పాలనుకుంటున్నాను' అని నీతీశ్ కుమార్ తెలిపారు.
వారసత్వ రాజకీయాలను నీతీశ్ కుమార్ ఖండించారు. 'రాజకీయాల్లో తమ వారసులకు అధికారం కట్టబెట్టడంపై చాలా మంది దృష్టి సారించారు. కానీ కర్పూరీజీ ఎప్పుడూ అలా చేయలేదు. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన నేను నా కుటుంబాన్ని రాజకీయాలను దూరంగా ఉంచాను. పార్టీలో ఇతర నేతలను ప్రోత్సహించడం పైనే నేను ఎక్కువ దృష్టి సారించాను' అని కాంగ్రెస్, లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీని ఉద్దేశించి విమర్శలు చేశారు. కర్పూరీకి భారతరత్న ఇవ్వడంపై యూపీఏ ప్రభుత్వానికి ఎన్నో అభ్యర్థనలు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు.
ఇదిలా ఉంటే బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కానీ కర్పూరీ ఠాకుర్ శతజయంతి వేడుకలను మాత్రం విడివిడిగా నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలున్నాయనే వార్తలు వస్తున్నాయి.
దీదీ షాక్- బంగాల్లో టీఎంసీ ఒంటరి పోరు- చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్
'కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోం'- ఒకే రోజు షాక్ ఇచ్చిన ఆప్, టీఎంసీ