Chardham Yatra Special Temples : హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో ఒకటి 'చార్ ధామ్ యాత్ర'. ఈ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు సాధారణంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లను సందర్శించి తిరిగి వస్తారని మనకు తెలుసు. అయితే దర్శించటానికి ఈ నాలుగు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. వాటిని దర్శించకపోతే ఆ యాత్ర అసంపూర్తిగానే ఉండిపోతుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.
యాత్రకు అనుమతినిచ్చే నారాయణ ఆలయం
చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు సాధారణంగా హరిద్వార్ నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించాలి. అయితే, ఇప్పుడు యాత్రికుల రద్దీ, అవసరం దృష్ట్యా, ప్రభుత్వం రిషికేశ్ నుంచి కూడా చార్ ధామ్ యాత్రను ప్రారంభించింది. కానీ హరిద్వార్ రిషికేశ్ మధ్య ఒక ప్రదేశం ఉంది. అదే సత్యనారాయణ స్వామి మందిరం. యాత్రను ప్రారంభించే ముందు, ఇక్కడి స్వామి నుంచి అనుమతి తీసుకోవాలని పండితులు చెబుతారు.
ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉంది. స్కంద పురాణంలో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావించారు. నేటికీ, చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. హరిద్వార్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
బద్రీనాథుని తల్లికీ ఓ గుడి
బద్రీనాథ్ వెళ్లే భక్తులు సాధారణంగా బద్రీనాథ్ దర్శనం మాత్రమే చేసుకుని తర్వాత తిరిగి వస్తారు. కానీ బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో బద్రీ-విశాల్ తల్లి ఆలయం ఉందని అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. అలకనందా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఆ తల్లి విష్ణువు కోసం చేసిన తపస్సుకు ఫలితంగా ఆమె గర్భం నుంచి విష్ణువు జన్మించారని చెబుతారు.
హనుమంతుని ఆలయం
బద్రీనాథ్ ధామ్‌లో మరొక ప్రదేశం కూడా చాలా ముఖ్యమమైనదిగా చెబుతారు. బద్రీనాథ్ ధామ్‌లోకి ప్రవేశించే ముందు, హనుమంతుని ఆలయంలో ఆశీర్వాదం తీసుకోవాలని అంటుంటారు. ఇది బద్రీనాథ్ ఆలయానికి 13 కిలోమీటర్ల ముందు ఉంది. భక్తుల సందర్శన సమయంలో ఈ ఆలయానికి భారీగా తరలివస్తారు.
మహాభారత కాలంలో పాండవులు ద్రౌపదితో కలిసి అడవిలో నివసిస్తున్నప్పుడు, ద్రౌపది బ్రహ్మకమలాన్ని తీసుకురమ్మని భీముడిని కోరింది. భీముడు నదికి వెళ్లే దారిలో ఓ వానరం పడుకొని ఉంటుంది. భీముడు ఆ వానరాన్ని దారివ్వమని అడిగాడు. కానీ "నేను వయస్సులో పెద్దదాన్ని కదలనేను నువ్వే పక్కకు తోసి వెళ్లు" అంటుంది ఆ కోతి . భీముడు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కోతి తోక కూడా కదపలేకపోతాడు. నావల్ల కాదని, నిజ రూపం చూపమంటూ భీముడు ప్రార్ధించగా అప్పుడు హనుమంతుడు ఈ ప్రదేశంలో భీముడికి నిజ రూపంలో ప్రత్యక్షమవుతాడు.
భైరవనాథ్ ఆలయం
కేదార్‌నాథ్ ఆలయానికి భైరవుడు క్షేత్ర పాలకుడు. ఈ గుడి ప్రధాన ఆలయానికి అర కిలోమీటరు దూరంలోనే ఉంది. అంతే కాదు ఇక్కడి నుంచి కేదార్‌నాథ్ లోయ మొత్తం అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ భైరవుడిని ఇక్కడ సాక్షాత్తు పరమ శివుడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ లోయ , పరిసర ప్రాంతాలు దుష్టశక్తులు, అలాగే ప్రతికూల శక్తుల ప్రభావానికి లోనుకాకుండా ఉండటానికి ఈ భైరవుడే కారణమని భావిస్తారు. అందుకే కేదార్‌నాథ్ వెళ్లే భక్తులు భైరవ ఆలయాన్ని కూడా సందర్శించడం తప్పనిసరి.