Amit Shah At BJP Convention : దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం అంతమయ్యే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ మూడో విడత పాలనలో దేశం వాటి నుంచి పూర్తిగా విముక్తి పొందనుందని, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్లు ఈ దేశాన్ని నాలుగు దశాబ్దాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో భాగంగా దిల్లీలోని భారత మండపంలో అమిత్ షా ఈ మేరకు వ్యాఖ్యానించారు.
'ఈ ఎన్నికలు మహాభారత యుద్ధం లాంటివి'
లోక్‌సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో అమిత్ షా పోల్చారు. ప్రధాని మోదీ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మరోవైపు బుజ్జగింపులకు పేరుగాంచిన కుటుంబం నడిపే పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ దేశం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తారని, కానీ ఇండియా కూటమి తమ పిల్లల్ని సీఎం, ప్రధానిని చేయాలని యోచిస్తుందని విమర్శించారు. బీజేపీలో కుటుంబ పాలన ఉండి ఉంటే చాయ్ అమ్ముకునే వ్యక్తి కుమారుడు ఇవాళ దేశానికి ప్రధాని అయ్యేవారు కాదని అమిత్ షా గుర్తు చేశారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల కాంగ్రెస్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కూడా రాలేదని విమర్శించారు.
-
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "INDI alliance and Congress party are destroying the spirit of democracy in the country. They coloured the democracy of the country with corruption, nepotism, appeasement and casteism. Such nepotistic parties were engaged in… pic.twitter.com/46EIFiDzoX
— ANI (@ANI) February 18, 2024
"దేశాన్ని బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి చేయాలని తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండో రోజునే ఇది ప్రారంభం కావాలి. కానీ, కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారంలో ఉన్నంత కాలం ఇది సాధ్యం కాలేదు. మోదీ పాలనలో అది ప్రారంభమైంది. బానిసత్వ చిహ్నాల నుంచి దేశాన్ని మోదీ విముక్తి చేస్తారని వారు ఊహించలేదు. బానిసత్వ చిహ్నాల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని ఆగస్టు 15న ఎర్రకోట నుంచి పిలుపునివ్వగా దాన్ని ప్రజలు స్వాగతించారు. ఇప్పుడు బానిసత్వం నుంచి మనం బయటకొస్తున్నాం. మోదీ మూడో సారి అధికారంలోకి వస్తే ఈ దేశం ఉగ్రవాదం, తీవ్రవాదం నక్సలిజం నుంచి విముక్తి పొంది శాంతియుత, సుసంపన్నమైన దేశం దిశగా పయనిస్తుంది."
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి